
సిబ్బంది సేవలు ప్రశంసనీయం
●ఎస్పీ ఆర్.గంగాధరరావు
●ఉద్యోగ విరమణ చేసిన
పోలీసులకు సన్మానం
కోనేరుసెంటర్: పోలీసుశాఖకు సుదీర్ఘకాలం పాటు అందించిన సేవలు నిరుపమానమని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన వివిధ హోదాల్లోని సిబ్బందిని శనివారం ఎస్పీ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉద్యోగంలో అనేక ఒత్తిళ్లు, ఒడుదొడుకులు ఉంటాయన్నారు. వాటిని అధిగమించి విధులు నిర్వర్తించటం అంటే మామూలు విషయం కాదన్నారు. సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా విధులను నిర్వర్తించి ఉద్యోగవిరమణ చేస్తున్న మీరంతా ఇప్పటి ఉద్యోగులకు స్ఫూర్తిప్రదాతలన్నారు. శేషజీవితాన్ని ఆరోగ్యంగా, కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగవిరమణ పొందిన పి.సుందరరావు (ఎస్సై–ఉమెన్ పీఎస్), కేవైఎస్ శేఖర్ (ఏఎస్సై–, గుడివాడ టూ టౌన్), కేఎంఎం వర్మ (ఏఎస్సై–, బందరు రూరల్), పీవీఎల్‌ఎన్ కుమారి (ఆఫీస్ సూపరింటెండెంట్)లను ఎస్పీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్‌బీ ఇన్‌చార్జ్ సీఐ వి.వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ రాఘవయ్య, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.