
దివ్యాంగులపై జూనియర్ అసిస్టెంట్ దురుసు ప్రవర్తన
ఇబ్రహీంపట్నం: సర్వే పేరుతో పింఛన్‌లు నిలిపేసిన అధికారులను కలిసేందుకు వెళ్లిన దివ్యాంగులతో ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ శనివారం దురుసుగా ప్రవర్తించాడు. మండలంలో సుమారు 116 మందికి ఈనెల పింఛన్‌లు నిలిపివేశారు. వైద్య పరీక్షలకు వెళ్లేందుకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. దీంతో ఎంపీడీఓ సునీతశర్మను రీవెరిఫికేషన్ కోరేందుకు దివ్యాంగులు వెళ్లారు. ఆమె ఇతర ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనందున జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించగా, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించి రెండు గంటల పాటు నిలబెట్టి కక్షపూరితంగా వ్యవహరించారు. దురుసుగా ప్రవర్తించి వినతిపత్రాన్ని విసిరి వేశాడని దివ్యాంగులు ఆవేదన చెందారు. చివరకు మీడియా రంగప్రవేశం చేయడంతో వినతిపత్రం తీసుకున్నారు. అధికారులు వెంటనే వెరిఫికేషన్ చేసి తమకు పింఛన్ వచ్చే విధంగా చూడాలని, తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు.