
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
నందిగామరూరల్: పట్టణ శివారులోని అంబారుపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సేకరించిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన మండూరి చిట్టిబాబు తన భార్య నాగమల్లేశ్వరి(30)తో కలిసి శనివారం మండలంలోని మాగల్లు గ్రామంలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో అంబారుపేట గ్రామ సమీపంలోని వై జంక్షన్ వద్దకు వచ్చే సరికి వెనుకగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై నుంచి మల్లేశ్వరి కింద పడగా, ఆమె పైనుంచి లారీ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిమన్యు తెలిపారు. మృతురాలికి కుమార్తె ఉన్నారు. నాగమల్లేశ్వరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం