
ప్రమాదపుటంచుల్లో దీవి
చోద్యం చూస్తున్న పాలకులు.. పట్టించుకోకపోతే మనుగడకే పెనుముప్పు
కృత్తివెన్ను: సాగర జలాలను ముద్దాడుతూ ప్రకృతి అందాలను ఒలకబోస్తూ ఆప్యాయంగా పలకరించే సుందరద్వీపం చినగొల్లపాలెం మనుగడ రోజు రోజుకు ప్రశ్నార్థమవుతోంది. మూడు వైపులా ఉప్పుటేరు, మరోవైపు బంగాళాఖాతం వెరసి నలువైపులా నుంచి నీరు ఈ దీవిని కబళిస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే కడలి వందలాది ఎకరాలను తనలో కలిపేసుకోగా, పాలకులు స్పందించి ఆదుకుంటారంటూ చినగొల్లపాలెం దీవి వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ తమ ఉనికికే ప్రమాదమనే తెలిసినా పుట్టిన గడ్డను వదల్లేక కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రకృతి ఒడిలో సుందర పుష్పం...
కృత్తివెన్ను మండలం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దున బంగాళాఖాతం, ఉప్పుటేరులు సరిహద్దుగా ఉన్న గ్రామం చినగొల్లపాలెం. చుట్టూ నీటితో ఉండటంతో ద్వీపంగా పిలుస్తారు. పది కిలోమీటర్లు పొడవున ఉండే ఈ దీవి దాదాపు పదివేల ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగువేల ఎకరాలు పైచిలుకు సాగు విస్తీర్ణం కలిగిన ఈ దీవిలో ప్రధానంగా సరుగుడు, కొబ్బిరి, పాక్షికంగా మామిడి, సపోట సాగు చేస్తారు. సాగునీటి సౌకర్యం లేకపోవడంతో కేవలం వర్షాధారంగా తక్కువ విస్తీర్ణంలో వరి, వేరుశనగ పండిస్తారు. పదివేల జనాభా కలిగిన దీవి ప్రస్తుతం ప్రమాదం అంచులో ఉంది. బంగాళాఖాతం దీవి వైపు వేగంగా దూసుకువస్తుండటమే ఇందుకు కారణం.
సముద్రపుకోతతో పెనుముప్పు...
గతంలో దీవికి తూర్పు వైపున పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుగా పాతకాలువ పేరుతో ఉప్పుటేరు పాయ ఉండేది. దీని ద్వారా ఎగువన భీమవరం కాలువ (యనమదుర్రు డ్రైన్) మొగల్తూరు కాలువ, కొల్లేరు ముంపునీరు సముద్రంలో కలిసేది. వరద నీటి తాకిడి ఎక్కువగా ఉండటంతో దీవికి ముప్పుగా భావించి 1970వ ప్రాంతంలో దీవికి పశ్చిమాన పడతడిక పంచాయితీ సరిహద్దుగా మరో కాలువను తవ్వారు. దీన్ని ఈప్రాంత వాసులు కొత్తకాలువగా పిలుస్తారు. కొల్లేరు నుంచి వచ్చే ముంపు నీరు ఈకాలువ ద్వారానే బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ కాలువ తవ్వకంతో అప్పటి వరకు ద్వీపకల్పంగా ఉన్న ఈప్రాంతం మానవ కల్పిత ద్వీపంగా మారిపోయింది. పాతకాలువ, కొత్తకాలువల ముఖద్వారాలు పూడుకుపోవడంతో సముద్రం నీరు మైదాన ప్రాంతంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో ఇప్పటికే సుమారు ఎనిమిది వందల ఎకరాలకుపైగా పంట భూములు సముద్రంలో కలిపోయాయి.
పట్టించుకునే నాథుడేడి?.
సముద్ర నీరు చొచ్చుకురావడాన్ని నివారించకపోతే అత్యంత త్వరలో దీవి సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని చిన్నగొల్లపాలెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీవి సంరక్షణ కోసం చర్యలు చేపడుతున్నామంటున్న పాలకుల హామీలన్నీ కాగితాలకే పరిమితం కావడం గ్రామస్తులను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. ఇకనైనా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని కాలువ ముఖద్వారాల్లో పూడికతీత పనులు చేపట్టడంతోపాటు సముద్రం వెంబడి రాతి కట్టడాన్ని నిర్మించి దీవిని కాపాడాలని దీవి వాసులు కోరుతున్నారు.

ప్రమాదపుటంచుల్లో దీవి