
మహనీయుల ఆలోచనలు స్ఫూర్తిదాయకం
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు
కోనేరుసెంటర్: మహనీయుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశంపంతులు చిత్రపటానికి ఆయన పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఆంధ్రరాష్ట్ర అవతరణ తరువాత తొలి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్పవ్యక్తి ప్రకాశంపంతులు అని కొనియాడారు. విద్య, స్వాతంత్య్ర పోరాటం, రాజకీయాల్లో ప్రకాశంపంతులు తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఎస్‌బీ సీఐ వాకా వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
జగ్గయ్యపేటఅర్బన్: ఉచిత బస్సులో సీటు కోసం సిగపట్లు పట్టుకున్న మహిళలపై జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీ్త్రశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్ జిల్లా విజయవాడ–జగ్గయ్యపేట రూటు బస్సులో సీటు విషయమై మహిళల మధ్య చెలరేగిన గొడవలో ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎంత చెప్పినా వారు వినకపోవడంతో డ్రైవర్ నేరుగా బస్సును జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. జగ్గయ్యపేట పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన మేఘావత్ ఉషారాణి బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనుగంచిప్రోలుకు చెందిన బండారు ఆదిలక్ష్మి, తురకా లావణ్య అనే తల్లీకూతుళ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.రాజు శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడంపై బీఎన్‌ఎస్ సెక్షన్ 3,126(2), ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై 115(2), పబ్లిక్ న్యూసెన్స్ కింద 351(2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్లు తెలిపారు.
మంత్రి దుర్గేష్‌ను కోరిన ఘంటసాల
బౌద్ధ గురువు భంతే ధమ్మ ధజ థెరో
ఘంటసాల: ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘంటసాల అభివృద్ధి చెందేందుకు చేపట్టిన సింహశయన బుద్ధ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఘంటసాలకు చెందిన బౌద్ధ గురువు భంతే ధమ్మ ధజ థెరో కోరారు. రాజమండ్రిలోని పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌ను కార్యాలయంలో భంతే ధమ్మ ధజ థెరో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భంతే ధమ్మ ధజ థెరో మాట్లాడుతూ విద్యార్థులకు మానవ విలువలు, ఒత్తిడి లేని ధ్యానం, గొప్ప వ్యక్తిత్వ వికాసం, విద్య గురించి మంత్రితో చర్చించి పాఠశాలల్లో అమలు చేసేలా చూడాలని కోరినట్లు చెప్పారు. ఈ అంశం పై విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిస్తానని చెప్పారన్నారు. బుద్ధ సర్క్యూట్‌లో భాగంగా ఘంటసాల ప్రాజెక్టును గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం మానవతా విలువలు, మానసిక ఒత్తిడిని నియంత్రించే ధ్యానం – మహోన్నత వ్యక్తిత్వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కరపత్రాలను మంత్రితో అనుచరులకు భంతే ధమ్మ ధజ థెరో అందించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,75,125 క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలివేస్తున్నారు. ఎగువ నుంచి బ్యారేజ్‌కు 3,92,920 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా దీనిలో 3,75,125 క్యూసెక్కులు సముద్రంలోకి, మిగిలిన 17,795 క్యూసెక్కుల వరద డెల్టాలోని కాల్వలకు విడుదల చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద తగ్గుముఖం పట్టింది.