
యూరియా గోతాంలో శవం
కంకటావలో కలకలం రేపిన మృతదేహం తాగిన మైకంలో కొడుకును హతమార్చిన తండ్రి
గూడూరు: మండలంలోని కంకటావలో సంచిలో కుళ్లిపోయిన మృతదేహం శుక్రవారం కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కంకటావ గ్రామానికి చెందిన వీరంకి విఘ్నేశ్వరరావు(38) గ్రామంలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన విఘ్నేశ్వరరావు భార్యతో తరచూ గొడవలు పడి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. రెండు నెలల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రి నిరంజన్‌రావుతో కలిసి విఘ్నేశ్వరరావు నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9న పూటుగా మద్యం తాగిన విఘ్నేశ్వరరావు తండ్రితో గొడవకు దిగాడు. గొడవ పెద్దదవడంతో ఆవేశంలో నిరంజన్‌రావు కొడుకుపై దుడ్డుకర్రతో దాడి చేయగా విఘ్నేశ్వరరావు మరణించాడు. కొడుకు తన చేతిలో హతమైపోయాడన్న విషయాన్ని గుర్తించిన నిరంజన్‌రావు యూరియా సంచిలో కొడుకు మృతదేహాన్ని వేసి ఇంటి సమీపంలోని పంట పొలాల పక్కన ఉన్న బోదె దగ్గర పడేశాడు. పైపెచ్చు తన కొడుకు కనిపించడం లేదంటూ ఊళ్లో వారికి చెప్పుకుంటూ కాలం వెళ్లదీశాడు. శుక్రవారం గొర్రెల కాపరులు సంచి నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బందరు డీఎస్పీ సీహెచ్.రాజా, పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్‌ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంచి బయటకు లాగి ఊడదీయించగా దానిలో నుంచి మృతదేహం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో కుమారుడిని తానే హత్య చేసినట్లు తండ్రి నిరంజన్‌రావు అంగీకరించినట్లు సమాచారం. మృతుడి సోదరుడు వీరంకి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన సీఐ కె.నాగేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యూరియా గోతాంలో శవం