
వాక్కాయలతో విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ
ఘంటసాలపాలెం(ఘంటసాల): మండలంలోని ఘంటసాలపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం వాక్కాయలతో విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త జి.కృష్ణవేణి వాక్కాయ (కరోండా)లతో లభించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, వాక్కాయలతో విలువ ఆధారిత ఉత్పత్తులైన జామ్, నిల్వ పచ్చడి, ఒరుగులు, వడియాలు మొదలైన వాటి గురించి వివరించారు. జామ్, నిల్వ పచ్చడి తయారు చేయించారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ వాక్కాయల్లో లభించే పోషక విలువల గురించి చెప్పి, మొక్కలను జీవకంచెగా నాటుకోవచ్చని, ఆదాయం పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వి.మంజువాణి, డాక్టర్ కె.రేవతి, డాక్టర్ బి.నవీన్, మహిళలు పాల్గొన్నారు. అనంతరం వయ్యారి భామ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం రోడ్డులో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. సేకరించిన వివరాల మేరకు స్థానిక ఆర్టీసీ బస్ డిపో సమీపంలోని ప్రసాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న బత్తుల దుర్గారావు(50) లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తాడు. కుటుంబంలో భార్యతో తలెత్తిన వివాదాలతో ఇటీవల మద్యం వ్యసనానికి గురయ్యాడు. కుటుంబ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తాగి ఉండటంతో అతనిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రాత్రంతా తాగుతూ తెల్లవారు జామున పవిత్ర సంగమం వెళ్లే రోడ్డులో ఉన్న చెట్టుకు తన లుంగీతో ఉరేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుర్గారావు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, వివాహాలు అయిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.