
ఏపీ చేనేత కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయండి
పెడన: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహా సభలు అక్టోబరు 6, 7 తేదీలలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతాయని, ఈ సభలను జయప్రదం చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ విజ్ఞప్తిచేశారు. సభలకు సంబంధించిన గోడ పత్రికలను శుక్రవారం స్థానికంగా జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని రక్షిస్తామని వాగ్దానాలు చేసి కార్పొరేట్ పవర్ లూమ్స్ యజమానులకు కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ చేనేతకు మరణ శాసనాన్ని రాస్తున్నారని దుయ్యబట్టారు. చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ వస్త్రాలను పవర్ లూమ్స్ యజమానులు తయారు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు రావాల్సిన యారన్ సబ్సిడీ పావలా వడ్డీ కింద రూ.156 కోట్లను సహకార సంఘాలకు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నిధులు విడుదల చేయకపోవడంతో సహకార సంఘాలు బ్యాంకులకు సకాలంలో అప్పులు తీర్చలేకపోతున్నాయన్నారు. నాబార్డ్ సంస్థ సొసైటీలకు చక్ర వడ్డీలు వేస్తోందని, కార్మికులకు పని కల్పించలేక సొసైటీలు మూతపడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే సొసైటీలకు ఇవ్వవలసిన రూ.156 కోట్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన రూ.5కోట్లను కూడా తక్షణం విడుదల చేయాలన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు అందరికీ ఇవ్వాలని, సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.25వేలకి వెంటనే విధివిధా నాలు ప్రకటించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా, పట్టణ నాయకులు గోరురాజు, వాసా గంగాధరరావు, పంచల రామనరసింహారావు, వూట్ల పేరయ్య లింగం, పొన్న సత్యనారాయణ, తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.