
ఆటో మోటార్ కార్మికులపై నిర్లక్ష్య వైఖరి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఆటో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్మిక సంఘాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తూ, ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడాన్ని ఆటో, మోటార్ ట్రాన్స్‌పోర్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ట్రాన్స్‌పోర్ట్ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. కూటమి అధికారం చేపట్టి 14 నెలలు గడిచినా ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 21 రద్దు, సాధికారత బోర్డు ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో మోటార్ కార్మికులకు పెన్షన్ రూపంలో సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.టీఎన్‌టీయూసీ నేతలు మరో వారం రోజుల్లో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యేలా చూస్తామని చెప్పారని, వారి మాట మేరకు మరో వారం రోజులపాటు వేచి ఉంటామని పేర్కొన్నారు. సీఎంతో సమావేశం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రంలో ఐక్య ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో మరోసారి సమావేశమై పోరాటలకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్, ఇఫ్టూ నాయకులు కె.పోలారి, దాది శ్రీనివాసరావు, ఎం.శంకర్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకుడు కె.దుర్గారావు, ఏపీ తెలుగు నాడు డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఎం.ఆదిబాబు, ఎం.సుబ్రహ్మణ్యం, బి.ఆంజనేయులు, విజయవాడ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం.ఈశ్వర్, ఆర్.వి.చిన్నబాబు, ప్రసాద్, మినీ ట్రక్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిదులు ఆషిఫ్ బాషా, డి.శ్రీధర్ బాబు, పి.రఫీ, ఎస్కె వలీ, ఎస్.రమణ తదితరులు పాల్గొన్నారు.