
శ్రమను మరచి సేదతీరడానికే పండుగలు
ఎస్పీ గంగాధరరావు
పెడన: సంప్రదాయాలు వేరైనా ప్రజలు తాము పడుతున్న శ్రమను మరిచి సేదతీరడానికి ఏర్పాటు చేసినవే రకరకాల పండుగలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రులతో పాటు సెప్టెంబరు 5న మిలాద్ ఉన్ నబీ పండుగ జరగనుంది. గతేడాది పెడనలో జరిగిన గొడవలను పురస్కరించుకుని గురువారం రాత్రి పట్టణంలోని పలు వర్గాలతో పోలీసులు పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పెడన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు మాట్లాడుతూ ముందస్తు చర్యగా పట్టణ పరిధిలోని పలువురు హిందువులు, ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఒకరినొకరు ఎదుటి వారి సంప్రదాయాలను గౌరవించాల్సి ఉందన్నారు. దీన్ని పురస్కరించుకుని పలువురు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందిస్తూ ... సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు పెట్టి ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఉత్సవాల సందర్భంగా ఎటువంటి కేసు లేని ముగింపు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, అందులో ఉత్సవ కమిటీలు వారి పూర్తి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉందన్నారు. హిందువులు, ముస్లింలు సమైక్యంగా, ఆనందంగా వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలు చేసుకుని ప్రశాంత వాతావరణం కల్పించాలని ఆయన కోరారు. బందరు డీఎస్పీ సీహెచ్.రాజా పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో పెడన తహసీల్దార్ కె.అనీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, సీఐ నాగేంద్ర ప్రసాద్, పలు స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.