
వైభవంగా రామలింగేశ్వరుని కల్యాణం
పెనమలూరు: యనమలకుదురులో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా గురువారం కల్యాణం నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి.. పల్లకీలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. శివసౌథంలో స్వామివార్లకు శాంతి కల్యాణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు, ప్రధాన పూజారి జీఆర్‌వీ సాగర్, ఆవో ఎన్. భవాని, భక్తులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: గర్భిణులు, బాలింతలకు కిల్కారి కాల్ సేవలు మేల్కొలుపని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.శర్మిష్ఠ తెలిపారు. మాతా, శిశు సంరక్షణ సేవలు బలోపేతంపై గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన కిల్కారి ప్రోగ్రాం గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య అవగాహన కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దీనిలో భాగంగా గర్భిణి 4వ నెల మొదలుకొని బిడ్డకు ఒక ఏడాది వచ్చే వరకు వారానికి ఒకసారి మొబైల్‌కు వాయిస్ కాల్ వస్తుందన్నారు. తల్లి, శిశువు ఆరోగ్యంపై ముఖ్యమైన సమాచారం అందిస్తుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే 911600103660 కిల్కారి కాల్ నంబర్‌ను గర్భిణిలు, బాలింతలు తమ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలన్నారు. ఒక వేళ సమాచారాన్ని మళ్లీ వినాలనుకుంటే టోల్ ఫ్రీ నంబర్ 14423 కాల్ చేసి వినే సౌకర్యం ఉందన్నారు. ప్రతి గర్భిణి, బాలింత ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. విజయవాడ గాంధీనగర్‌లోని హోమ్ ల్యాండ్ కల్యాణ చక్రవర్తి( పాత కల్యాణ చక్రవర్తి థియేటర్) నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగిల్ విండో పద్ధతిలో ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలన్న ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం అభినందనీయమన్నారు. హిందువులు సామూహికంగా నిర్వహించే గణేష్ నవరాత్రుల్లో, పండుగల్లో అనుమతుల పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఈ విధానంలో 24 గంటల్లో అనుమతులు వస్తాయన్నారు. సమితి అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ 2025 నిర్వహిస్తున్నట్లు కృష్ణా డీఈఓ పీవీజే రామారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. తమ పరిసరాల్లో సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి వినూత్న ఆలోచనలు రూపొందించి, ప్రాజెక్టు వీడియోను సెప్టెంబర్ 30వ తేదీ లోపు అప్‌లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. ఉత్తమ ప్రాజెక్టులకు రూ.1.5లక్షల వరకు నగదు బహుమతులు, పేటెంట్, ఉత్పత్తి, మార్కెటింగ్ సహాయం అందిస్తామన్నారు. గతేడాది రాష్ట్రం నుంచి ఎంపికై న 57 ప్రాజెక్టుల్లో కృష్ణా జిల్లా నుంచి 7 ప్రాజెక్టులున్నాయని చెప్పారు. ఇన్నోవేషన్ మారథాన్ వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి మహ్మద్ జాకీర్ అహ్మద్‌ను సంప్రదించాలని సూచించారు.