
గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గృహనిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గృహనిర్మాణాల పురోగతి, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తదితర అంశాలపై నియోజకవర్గ, మండ ల, క్షేత్రస్థాయి ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా గృహనిర్మాణంలో చాలా వెనుకబడి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10,007 ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 3,966 గృహాలు మాత్రమే పూర్తి చేశారన్నారు. మిగిలిన గృహాలను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎందుకు ఆలస్యమవుతుందని, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. వచ్చే మార్చి 31వ తేదీ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని.. ఈలోగా పూర్తి చేయకపోతే ఇబ్బందులు పడతారన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన తిరిగి మరలా సమావేశం నిర్వహిస్తానని ఆలోగా లక్ష్యాలు పూర్తి చేయకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
సదరం ప్రత్యేక క్యాంపులు..
దివ్యాంగ పింఛన్లకు సంబంధించి 4,332 మంది దివ్యాంగులకు 40శాతం లోపు వికలాంగత్వం ఉన్నందున అనర్హులుగా గుర్తించి వారికి పింఛన్లు ఇవ్వలేదన్నారు. తిరిగి పునరుద్ధరించాలని మీకోసం, క్షేత్రస్థాయిలో దరఖాస్తు చేసుకుంటున్నారని.. వారందరికీ సదరం ప్రత్యేక డ్రైవ్‌పై అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, డీసీహెచ్‌ఎస్ సంయుక్తంగా ఈ నెల 25వ తేదీ వరకు వికలాంగత్వంపై పునఃపరిశీలన కార్యక్రమం చేయాలన్నారు.
జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి ఎస్. వెంకట్రావు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు హరిహరనాథ్, ఎంవీ శివప్రసాద్, మెప్మా పీడీ సాయిబాబు, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీపీవో జె. అరుణ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ