
స్క్రబ్ టైఫస్.. అరుదైన జ్వరం
అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం జ్వరంతో ప్రారంభమై అవయవాలపై తీవ్ర ప్రభావం మెదడు, కిడ్నీలు, లివర్, రక్తనాళాలకు నష్టం తరచూ నమోదవుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాధారణంగా వర్షాకాలంలో దోమ కాటు కార ణంగా మలేరియా, డెంగీ వంటి జ్వరాలు ప్రబలుతాయి. గడ్డి, పిచ్చి చెట్లలో పెరిగే సుట్సుగా ముషి కీటకం కుట్టిన వారికి స్క్రబ్ టైఫస్ జ్వరం సోకుతుంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురు ఈ జ్వరాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ సోకిన వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో పదేళ్ల బాలుడు తీవ్రమైన జ్వరంతో విజయవాడలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చేరాడు. రెండు రోజులైనా జ్వరం తీవ్రత తగ్గలేదు. డాక్టర్‌కు అనుమానం వచ్చి బాలుడి శరీరాన్ని నిశితంగా పరిశీలించగా ఓ మచ్చ కనిపించింది. వెంటనే పరీక్షలు చేయించగా బాలుడికి సోకింది స్క్రబ్ టైఫస్ జ్వరంగా తేలింది. గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గత ఏడాది విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల్లో అతనికి సోకింది స్క్రబ్ టైఫస్‌గా తేలింది. అతనికి సకాలంలో వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్రబ్ టైఫస్ కొన్నేళ్లుగా తరచుగా వింటున్న అరుదైన జ్వరం. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రితో పాటు, పలు కార్పొరేట్ ఆస్పత్రులకు ఉమ్మడి జిల్లాతో పాటు, పొరుగు జిల్లాల నుంచి బాధితులు వస్తున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తొలుత ఆకస్మిక జ్వరంతో ప్రారంభమై క్రమేణా లివర్, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుందని, రక్తనాళాలు దెబ్బతినడం, తెల్ల రక్తకణాలపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.
వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే
దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కు వగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకు తుంది. గడ్డి, చెట్లు, పొలాల్లో ఉంటే సుట్సుగాముషి అనే కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొందరికి కీటకం కుట్టిన వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుంది. మరి కొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు ఇలా...
సుట్సుగాముషి కీటకం కుట్టిన వారిలో జ్వరం అకస్మాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కళ్లు తిరగడం, మగత, వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి వారి శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్ధారించేందుకు ఏలీసా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ప్రభావం ఇలా..
స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో అధిక జ్వరంతో పాటు, న్యూమోనైటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్‌రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. కిడ్నీలు పనిచేయకపోవడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరకోవచ్చు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందడం ద్వారా ఎలాంటి ప్రభావం చూపకుండా బయటపడొచ్చు.
కీటకం కుడితే శరీరంపై ఏర్పడే మచ్చ వ్యాధి కారక సుట్సుగాముషి కీటకం
స్క్రబ్ టైఫస్ వ్యాధి మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. హెచ్‌ఐవీ రోగులకు సోకినా ప్రాణాంతకమే. చిన్నపిల్లలు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకితే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి వారు తగిన సమయంలో చికిత్స పొందాల్సిన అవసరం ఉంది.

స్క్రబ్ టైఫస్.. అరుదైన జ్వరం