
ఉత్సాహంగా 5కే మారథాన్ రెడ్ రన్
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు మారథాన్ రెడ్ రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ – టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బి.భానూనాయక్ తెలిపారు. స్థానిక సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో మంగళవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల మారథాన్ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భానూనాయక్ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ శ్యాంసన్‌తో కలిసి మారథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. హెచ్‌ఐవీ బాధితులను ఆదరించాలని సూచించారు. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. 5కే మారథాన్ పోటీల్లో జిల్లాలోని పలు కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలు వీరే...
ఈ పోటీలలో పి.వినయ్ (పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ – సైన్సు కళాశాల) ప్రథమ, వై.లక్ష్మీతిరుమలరావు (ఆంధ్ర లయోల కళాశాల) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. మహిళా విభాగంలో ఎస్.నిషా(ఎస్‌డీఎం. సిద్ధార్థ మహిళా కళాశాల), వి.హన్నా (ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల) వరుసగా తొలి రెండు స్థానాలు సాధించారు. ట్రాన్స్‌జెండర్ విభాగంలో ఎం.రాజి ప్రథమ, బి.మాయ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీలను ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ విద్య విభాగాధిపతి యుగంధర్ సమన్వయం చేశారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7వేలను త్వరంలో కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తామని డాక్టర్ భానూ నాయక్ తెలిపారు.