
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి ఫొటో జర్నలిస్టులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, వాటిలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దడంలోనూ ఫొటో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. వివిధ మోడళ్ల కెమెరాలను కలెక్టర్ క్లిక్ మనింపించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు తొమ్మిది రాష్ట్రాల నుంచి స్పాట్ న్యూస్, జనరల్ కేటగిరీలో 552 ఫొటోలు రాగా 50 ఫొటోలకు బహుమతులు లభించాయి. విజేతలకు సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్, కలెక్టర్ లక్ష్మీశ జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి అవార్డులు ప్రదానం చేశారు. ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఒక ఛాయాచిత్రం వేయి భావాల నేత్రమని, వేల కథనాలకు సరిసాటి అని పేర్కొ న్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు పి.వి.కృష్ణారావు, సీనియర్ ఫొటో జర్నలిస్టులు సీహెచ్.వి.మస్తాన్, సీహెచ్.నారాయణరావు, ఐ అండ్ పీఆర్ శాఖలో సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వి.వి. ప్రసాద్‌ను సత్కరించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
డాక్టర్ లక్ష్మీశ