
కూటమి నిరంకుశానికి లక్ష్మి మృతి నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్
పెదపూడి(మొవ్వ): కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు మేడం లక్ష్మి మృతి నిదర్శనమని, ఆమె మరణానికి సర్కారే కారణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే ౖకైలే అనిల్‌కుమార్ పేర్కొ న్నారు. పెన్షన్ తొలిగించారనే మనోవ్యథతో పెద పూడి గ్రామంలో దివ్యాంగురాలు మేడం లక్ష్మి మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి కైలే అనిల్‌కుమార్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయంగా తన పెన్షన్ తొలగించారన్న మనోవ్యథతో లక్ష్మి మరణించటం బాధాకరమన్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
నది పరీవాహక ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి
పటమట(విజయవాడతూర్పు): నగరంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నుంచి మంగళవారం ఉదయం 5.5 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోందని, దీంతో హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. పులిచింతల డ్యామ్ నుంచి కూడా వరద ప్రవాహం పెరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని వివరించారు. బ్యారేజీ వద్ద వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకంటే ఎక్కువగా ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుకుందని పేర్కొన్నారు. వరద ఆరు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోకి తరలి రావాలని కమిషనర్ సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు వీఎంసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
పమిడిముక్కల: విద్యుదాఘాతంతో బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గురజాడ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన కాండ్రు అబుషలేం కుమారుడు హర్షవర్ధన్ (13) తాడంకి హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి తమ కాలనీలో జరిగే వివాహ వేడుకకు వెళ్లాడు. విద్యుత్ పోల్ నుంచి పెళ్లి పంది రికి లైటింగ్ లాగారు. వర్షం పడుతుండటంతో పెళ్లిపందిరి వద్ద ఉన్న ఐరన్ రాడ్‌కు విద్యుత్ సరఫరా జరిగింది. ఈ విషయం తెలియని హర్షవర్ధన్ ఆ రాడ్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీను తెలిపారు.
బైక్ దొంగలకు జైలు శిక్ష
మైలవరం: బైక్ చోరీ కేసులో ఇద్దరు దొంగలపై నేరం రుజువు కావడంతో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్‌ఐ సుధాకర్ కథనం మేరకు.. మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలు జరిగాయి. ఈ చోరీలపై కేసులు నమోదయ్యాయి. జి.కొండూరు మండలం గంగినేని గ్రామానికి చెందిన ఎం.నాగ తిరుపతిరావు, పల్లెపు మారేశ్వరరావును పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి 2024 సెప్టెంబర్ 12వ తేదీన అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సకాలంలో విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో మైలవరం జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.శైలజ మంగళవారం మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.కృష్ణకిశోర్ వాదనలు వినిపించారు. నిందితులను నూజివీడు సబ్ జైలుకు పంపించినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
ఐదు ఇసుక టిప్పర్ల పట్టివేత
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్ లారీలను విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. కృష్ణానదికి వరద వచ్చినప్పటికి పాత వీబీఎం డిగ్రీ కాలేజీ సమీపంలోని జంక్షన్ వద్ద ఇసుక తరలిస్తున్న లారీలను గుర్తించారు. లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్‌ఐ పి.రాజేంద్రబాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. కృష్ణానదికి వరద వచ్చినా లారీల్లో ఇసుక ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు? అనుమతులు చూపాలంటూ ఎస్‌ఐ డ్రైవర్‌లను ప్రశ్నించారు. డ్రైవర్ల నుంచి సమాధానం రాకపోవడంతో ఒక్కో లారీకి రూ.2,035 జరిమానా విధించారు. వరద తగ్గేంత వరకు ఇసుక లారీలు, ట్రాక్టర్లు గాని రావడానికి వీలులేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.

కూటమి నిరంకుశానికి లక్ష్మి మృతి నిదర్శనం