
ఏదయా.. యూరియా!
ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలు
బుద్దాలపాలెం సొసైటీలో ఎరువుల పంపిణీలో కూడా కూటమి నాయకుల హవా కొనసాగింది. కూటమి నాయకులు చెప్పిన పేర్లకే టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరికీ రెండు కట్టలు చొప్పున ఎరువులు అందజేశారు. అయితే కొంత మంది రైతులకు అందకపోవటంతో సొసైటీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో త్వరలో మరో ఎరువుల లోడ్ వస్తుందని అప్పుడు అందరికీ అందజేస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అయితే అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఎరువులు పంపిణీ చేశారని తమ పరిస్థితి ఏమిటని మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమానికి తాము పాటుపడతామని రైతులకు ఎటువంటి కష్టం రానివ్వకుండా తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి.. నేడు రైతులను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎరువులు సక్రమంగా అందించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరి ఎరువుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
బుద్దాలపాలెంలో దిక్కుతోచని స్థితి..
బుద్దాలపాలెం సొసైటీ పరిధిలో ఉన్న బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, పిల్లవానిగొల్లపాలెంతో పాటు కొంతమేర కొత్తపూడి, కాకర్లమూడి గ్రామాలకు చెందిన భూములకు చెందిన రైతులు పంట రుణాలు తీసుకున్నారు. సుమారు 2 వేల ఎకరాలు ఆయకట్టులో వరిసాగు చేస్తున్నారు. వీరికి ఎకరానికి నాలుగు బస్తాల ఎరువులు కావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఇంత వరకు వారికి ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవటంతో పంట ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బుద్దాలపాలెం సొసైటీకి సోమవారం అరకొరగా ఎరువులు రావటంతో రైతులు తమకు అందుతాయో, లేదోనని ఆందోళన చేపట్టారు. వచ్చిన ఎరువులు అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. దీంతో సొసైటీ ప్రతినిధులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను నిలువరించేప్రయత్నం చేశారు. రైతులు అంతటితో ఆగకుండా ఎరువులు అందరికీ సమానంగా పంచాలని పూర్తిస్థాయి ఎరువులు అందించకపోతే తమ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సొసైటీ సిబ్బంది, పోలీసుల జోక్యంతో రైతులకు రెండు కట్టలు చొప్పున అందజేస్తామని చెప్పి టోకెన్లు అందజేసి వాటి ఆధారంగా ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పారు.
● గూడూరు మండల పరిధిలోని కంకటావ, ఆకులమన్నాడు గ్రామల్లో అదే పరిస్థితి కనిపించింది. కొందరు బడా రైతులు పలుకుబడి చూపించుకుని యూరియా దక్కించుకుంటుంటే చిన్నకారు రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆయా సంఘాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
● కృత్తివెన్ను పీఏసీఎస్‌కు 20 టన్నుల యూరియా లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. ముందు నమోదు చేసుకున్న వారికి ఇవ్వగా.. మిగిలిన వారికి అరకట్ట ఇచ్చి సరిపెట్టారు.
● బంటుమిల్లి పీఏసీఎస్ వద్ద యూరియా అమ్మకాలు మొదలు పెట్టగానే రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వచ్చి రైతులకు సర్దిచెప్పి లైనులో ఉంచి స్లిప్పులు రాయించారు. తర్వాత ఎకరానికి అర కట్ట చొప్పున అత్యధికంగా రెండు కట్టలు పంపిణీ చేశారు.
● మోపిదేవి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)కు సోమవారం యూరియా వచ్చిందని తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. గంటల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి.
● ఘంటసాల మండలంలో ఒక్కో రైతుకు ఎకరాకు 25 కేజీలు మించి ఇవ్వరాదని, రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు కట్టలు మాత్రమే ఇవ్వాలని అధికారులు నిబంధనలు పెట్టారంటే యూరియా కొరత ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
● గుడ్లవల్లేరు మండలంలోని రైతులకు యూరియా పంపిణీ అరకొరగా జరిగింది. బడా బాబులకు యూరియాను దొడ్డిదారిన కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● ఉంగుటూరు పీఏసీఎస్ వద్ద సోమవారం యూరియా కోసం రైతులు వందల సంఖ్యలో బారులు తీరారు.
కూటమి నాయకులు చెప్పిన వారికే..
కూటమి నాయకులు చెప్పిన వారికే టోకెన్ల వారీగా పంపిణీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు జిల్లా వ్యాప్తంగా ఆందోళన బాట నష్టపోతున్నాం.. ఆదుకోవాలని వేడుకోలు
రుణం ఉన్న వారికి మాత్రమే..
పెడన: మండలంలోని పలు పీఏసీఎస్‌లకు యూరియా లోడు రావడంతో సోమవారం వేకువ జాము నుంచే రైతులు ఆయా పీఏసీఎస్‌లు వద్ద బారులు తీరారు. రైతుల రద్దీని చూసి ఆయా పీఏసీఎస్‌లు వద్ద ఒక్కో కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని అనుకున్నారు. పెనుమల్లి పీఏసీఎస్ వద్ద పరిస్థితి అదుపుతప్పడంతో కానిస్టేబుల్‌ను సైతం తోపులాటలో పక్కకు లాగేశారు. దీంతో అక్కడ ఎస్‌ఐ సత్యనారాయణ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది క్యూలైన్‌లో రైతులు నిలబడేలా చర్యలు తీసుకున్నారు. పీఏసీఎస్ సిబ్బంది బ్యాంకులో రుణం ఉన్న వారికి మాత్రమే యూరియా కట్టలు ఇస్తామని పేర్కొనడమే కాకుండా దండాలు పెట్టి మరీ చెబుతుండటంతో మిగిలిన రైతులు తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో ముందుగా వారికి ఇచ్చిన తరువాత మిగిలినవి ఇస్తామని చెప్పడంతో చేసేది లేక రైతులు అలాగే క్యూ లైన్‌లో వేచి తమ వంతు వచ్చేదాక ఉండి తీసుకువెళ్లారు. అరకట్ట చొప్పున మాత్రమే ఇవ్వడంతో ఇద్దరి రైతులకు ఒక కట్ట చొప్పున అందజేశారు.

ఏదయా.. యూరియా!