
అర్జీదారునికి భరోసా ఇవ్వండి
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’లో వచ్చే అర్జీలు పరిష్కరించి అర్జీదారుడికి భరోసా కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు, ఆర్డీవో కె. స్వాతి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో జారీ చేసిన సర్క్యులర్లు, నోటిఫికేషన్లు, మెమోలు, ఉత్తర్వులు రియల్ టైమ్ గవర్నెన్స్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వేడుకల్లో మంత్రి సందేశం కోసం ఆయా శాఖల ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు సమాచారశాఖకు అందజేయాలన్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వశాఖల అధికారులు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు శాఖల వారీగా, క్యాడర్ల వారీగా పోస్టుల వివరాలను తమకు పంపాలన్నారు. తాము నియామకపత్రాలు అందజేసినప్పుడు ఆయా శాఖల అధికారులు వారిని జాయిన్ చేసుకోకుండా జాప్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి విషయాల్లో కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారని అలాంటి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. మీకోసంలో అధికారులు 103 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● తనకు వస్తున్న దివ్యాంగుల పెన్షన్‌ను గత రెండు నెలలుగా నిలిపివేశారని.. తాను పెన్షన్ ఆధారంగా జీవిస్తున్నానని, అర్ధాంతరంగా నిలిపివేసిన పింఛన్ ను తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన జాగాబత్తుల దాక్షాయణి అర్జీ ఇచ్చారు.
● తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో సర్వే నెంబర్ 163/3, 164/3 తదితర నంబర్లలో సుమారు 7.44 ఎకరాల భూమి ఉండగా.. రీ–సర్వే నిర్వహించినప్పుడు 6.98 ఎకరాలుగానే చూపుతున్నారు. ఈ సర్వేలో దాదాపు 50 సెంట్ల భూమి తేడా వచ్చి ఉన్నందున మరలా సర్వే నిర్వహించి తనకు న్యాయం చేయాలని విజయవాడ రూరల్ మండలానికి చెందిన నార్ల సుగుణ అర్జీ ఇచ్చారు.
● మచిలీపట్నం నగరంలోని పరాసుపేట పుచ్చల్లపల్లి సుందరయ్య రోడ్డు, సెయింట్ ప్రాన్సిస్ పాఠశాల ఎదురు సందులోని ఓ ఇంట్లో సెల్‌టవర్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఈ టవరు ఏర్పాటు చేస్తే సమీప నివాస గృహాల వారికి పర్యావరణ సమస్యలతో పాటు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని సెల్ టవర్ ఏర్పాటు నిర్ణయాన్ని అనుమతించకుండా తమకు న్యాయం చేయాలని కోరుతూ కేవీ గోపాలరావు తదితరులు అర్జీ ఇచ్చారు.
డీఆర్వో చంద్రశేఖరరావు ‘మీ కోసం’లో 103 అర్జీలు స్వీకరణ