
ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, స్వదేశీ ఉత్పత్తుల తయారీతో పాటు కొనుగోళ్లను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుంచి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డీఆర్వో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించాయన్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు, పార్కులు తదితర సంస్థల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. అలాగే స్వదేశీ వస్తువుల తయారీ, వాటి అమ్మకాలను ప్రోత్సహించాల్సి ఉందని, స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అంశంలో ముఖ్యంగా చొరవ చూపాలన్నారు. కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు, జిల్లా పర్యాటక అధికారి రామ్‌లక్ష్మణరావు, ఆర్డీవో కె. స్వాతి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు హరిహరనాథ్, శివప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం. ఫణిదూర్జటి, డీఐపీఆర్వో వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్వో చంద్రశేఖరరావు