జగ్గయ్యపేట: వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ. 26.02లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. నాలుగు నెలల 15 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ పవన్ కల్యాణ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వేలంతో రూ. 10.32లక్షల ఆదాయం..
ఆలయ ప్రాంగణంలో కొబ్బరిచిప్పలు పోగు చేసుకునేందుకు తులసీ పూలు నిర్వహించుకునేందుకు బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరిచిప్పలు పోగు చేసుకునేందుకు గ్రామానికి చెందిన పోలోజు గోపి రూ.4లక్షలు, తులసి పూలు అమ్ముకునే హక్కుకు రూ. 6.32 లక్షలకు కై వసం చేసుకున్నారని తెలిపారు. ఏడాది పాటు పాటలు అమలులో ఉంటాయని తెలిపారు.
పారదర్శకంగా అమలు చేస్తాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గగుడిలో ఉచిత భోజన పథకాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆలయ ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు. ‘అమ్మ సన్నిధిలో.. లెక్కల్లోనే భో‘జనం’’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలలో ప్రచురితమైన వార్త పై ఆయన స్పందించారు. అన్నదానం సంబంధించిన ప్రదేశాలను సోమవారం తనిఖీ చేశారు. సిబ్బందిని పిలిచి ఆరా తీశారు. దీనిపై లోతుగా అంతర్గత విచారణ చేసి బాధ్యులైన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నదానం కార్యక్రమం అంతర్గత పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. ఇందులో భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రికి రెండు అంబులెన్స్‌లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రూ.79 లక్షలు విలువ చేసే రెండు అంబులెన్స్‌లను అందించింది. ఈ సందర్భంగా విజయవాడలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ డెప్యూటీ జనరల్ మేనేజర్ షితాక్షి సింగ్ అంబులెన్స్‌ల తాళాలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. షితాక్షి సింగ్ మాట్లాడుతూ సేవా రంగంలో ఎస్‌బీఐ దేశంలోనే ఇతర బ్యాంకులు కన్నా ముందంజలో ఉందన్నారు. ఆ బ్యాంక్ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాసరావు, కార్మికశాఖ జాయింట్ కమిషనర్ రాణి, ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ వి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్‌లో అందుబాటులోకి ‘డాక్‌బాక్స్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐసీయూ రోగులకు మెరుగైన, వేగవంతమైన చికిత్స అందించేందుకు దోహదపడే ‘డాక్‌బాక్స్’ టెక్నాలజీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ వై.రమేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ డాక్‌బాక్స్ టెక్నాలజీలో ఐసీయూ చికిత్స పొందే రోగి మానిటర్స్, వెంటిలేటర్స్ ఇన్ఫూషన్ పంప్స్, డయాలసిస్ మెషీన్స్ ఎనస్థీషియా మెషీన్స్ వంటి పరికరాల డేటాను ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుందన్నారు. ఆ డేటా ఎప్పటికీ రోగి ఐడీలో భద్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేర్ ఫ్లూయెన్స్ ప్రతినిధి విలియమ్స్, ఆయుష్ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పీఎస్‌ఎస్ చౌదరి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేడ జయలక్ష్మి, క్రిటికల్ కేర్ నిపుణులు పాల్గొన్నారు.

నరసింహుడికి రూ.36 లక్షల ఆదాయం