
కొత్త పింఛన్ల కోసం నిరీక్షణ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా కొత్త పింఛన్ల మంజూరుపై నిర్ణయం ప్రకటించలేదు. కొత్త పింఛన్లు మంజూరవుతాయో లేదోనని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకుందామంటే ఆన్‌లైన్‌లో సైట్ ఓపెన్ కావటం లేదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని అధికారులు చెబుతుంటే ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వృద్ధులు, వికలాంగులు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం జనవరి, జూలైలో కొత్త పింఛన్లు మంజూరు చేసి, లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొత్త పింఛన్లకు అవకాశం లేకపోవటంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడంలేదు.
మంజూరైనా ఎదురుచూపులే..
జిల్లాలో ఇటీవల వితంతు పింఛన్లను మంజూరు చేశారు. ఈ మంజూరులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మందికి ఇవ్వాలన్న ఆలోచన లేకుండా షరతులు విధించింది. 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీలోపు చనిపోయిన పింఛన్‌దారుల భార్యలకు మాత్రమే వితంతు పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పింది. పింఛన్ పొందని వ్యక్తి చనిపోతే అతని భార్యకు అర్హత లేకుండా చేసింది. జిల్లాలో 3,287 మందికి మాత్రమే కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేశారు. వారికి పింఛన్లు అందజేసేందుకు గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశాలు రాలేదు. ఈ పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో తెలి యక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 2,34,414 మంది లబ్ధిదారులు
జిల్లాలో ప్రస్తుతం 2,34,414 మందికి వివిధ సామాజిక పింఛన్లు అందుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అవనిగడ్డలో 42,359 మంది, గన్నవరం 30,297, గుడివాడ 27,744, మచిలీపట్నం 30,019, పామర్రు 35,560, పెడన 31,632, పెనమలూరులో 36,803 మంది లబ్ధిదారులు పింఛన్లు అందుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్హులు సమర్పించిన దరఖాస్తుల్లో కొన్నింటిని గ్రామీణాభివృద్ధి శాఖకు, మరి కొన్నింటిని సంబంధిత ఎంపీడీఓలకు బదిలీ చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వెయ్యికు పైగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పింఛన్‌ను రూ.1000 పెంచి, మిగిలిన హామలన్నీ తుంగలోకి తొక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పినా నేటికీ అమలు చేయలేదు.
పీజీఆర్‌ఎస్‌లో పింఛన్ల కోసం వెయ్యికి పైగా దరఖాస్తులు మంజూరైన వితంతు పింఛన్లకు నగదు అందజేసేదెప్పుడో? గతంలో సంవత్సరానికి రెండుసార్లు పింఛన్లు మంజూరు
వితంతు పింఛను మంజూరు చేయలేదు
కూటమి ప్రభుత్వం వితంతు పింఛను మంజూరు చేస్తుందని ఆశించాను. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంత వరకు నాకు పింఛను మంజూరు చేయలేదు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్‌కు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందనే ఆశతో నాగాయలంక నుంచి మచిలీపట్నం వచ్చాను. ఇప్పటికైనా పింఛను మంజూరు చేసి నాకు న్యాయం చేయాలి.
– కరంకి నాగేంద్రం,
గణపేశ్వరం, నాగాయలంక మండలం
ప్రతి నెలా పింఛన్లు
మంజూరు చేయాలి
దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ప్రతినెలా మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంత వరకు పింఛన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. అయితే పింఛన్ల దరఖాస్తుల్లో ఆ నిబంధన అమలుకావడంలేదు. అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు.
– బూర సుబ్రహ్మణ్యం,
సీఐటీయూ మచిలీపట్నం నగర అధ్యక్షుడు

కొత్త పింఛన్ల కోసం నిరీక్షణ

కొత్త పింఛన్ల కోసం నిరీక్షణ