సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం
విజయవాడకల్చరల్: శ్రీ అన్నమయ్య సంకీర్తనా అకాడమీ( శ్వాస), కంచికామకోటి పీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నమయ్య జయంతి జాతీయ స్థాయి సంగీత కార్యక్రమాలు మధురంగా సాగుతున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంగీత విద్యాలయం విద్యార్థినులు, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థినులు, బంకుమల్లి విద్యాసాగర్, ధూళిపాళ వాసవి అన్నమయ్య రచించిన చక్కని తల్లికి చాంగ్‌భళా, పలుకుతేనియ తల్లిని, అదివో అల్లదివో శ్రీహరి వాసము, తందనానా ఆహి తందనానాతో పాటు అనేక సంకీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు. చివరిగా మల్లాది సోదరులు అన్నమయ్య పదానికి పట్టం కడుతూ సంకీర్తనలను గానం చేశారు. శ్వాస నిర్వాహకులు సత్యబాబు, ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
సీబీఎస్‌ఈ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థుల ప్రతిభ
గుడివాడటౌన్: సీబీఎస్‌ఈ విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ సత్యారామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన జె.లక్ష్మీ నరసింహ భరద్వాజ్ 490/500, ఎం.అక్షయప్రియ, ఆర్.వివేక్ 488/ 500తో పాటు 480 పైబడి 24 మంది, 475 పైబడి 52 మంది, 470 పైబడి 81 మంది, 460 దాటిన వారు 165 మంది విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని, ప్రోత్సహించిన తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం తరఫునఅభినందించారు.
పలు కేసుల్లో నిందితునిపై పీడీ యాక్టు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయాలతో యువత ఆరోగ్యానికి భంగం కలిగించడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అక్బర్ బాషాపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించింది. విద్యాధరపురానికి చెందిన అక్బర్ బాషాపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్‌లలో 35 కేసులు ఉన్నాయి. వీటిలో 5 గంజాయి కేసులు, 30 దొంగతనం, దోపీడీ కేసులు నమోదయ్యాయి. భవానీపురం స్టేషన్‌లోనే 4 గంజాయి కేసులు, 5 దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బెయిల్‌పై విడుదల అయి వచ్చి తిరిగి గంజాయి విక్రయాలు, దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండడంతో ప్రభుత్వం అక్బర్‌బాషాపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్బర్ బాషాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం


