భవన నిర్మాణ కార్మికుల ధర్నా
మచిలీపట్నంటౌన్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు గురువారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా పేర్కొన్నారు. ఈ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు కాకపోవటంతో ఇబ్బందులు పడుతు న్నాని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు. మొన్నటి వరకు కలిసి ఉన్న తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలోనూ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.వి.గోపాలరావు మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా కొత్త పథకాలు అభివృద్ధి చేసి అమలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం 12, 14 మెమో ఇచ్చి అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపివేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్రకు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సీఐటీయూ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వై.నరసింహారావు, బేతా శీను, ఎండి కరీముల్లా, మాజేడి శ్రీనివాస రావు, పెదబాబు, బిల్డింగ్ వర్కర్స్ మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బండారు శీను, మీర్ ఆలీ అక్బర్ పాల్గొన్నారు.


