దిగుబడులపై రైతుల ఆశకు కత్తెర
పెనుగంచిప్రోలు: రబీ సీజన్‌లో ఆరుతడి పంటగా మొక్కజొన్నకు సాగు చేస్తున్న రైతులకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. మొక్క జొన్న పైరును కత్తెర పురుగు ఆశిస్తోంది. ఈ పురుగు ఉధృతి కారణంగా పంట దిగుబడులు పడిపోతాయని రైతులు ఆందో ళన చెందుతున్నారు. పంట తొలినాళ్లలోనే పురుగు ఆశించిందని, తమ ఆశలను కత్తెర పురుగు ఆడియాశలు చేసేలా ఉందని కలవరపడుతున్నారు. ఈ పురుగును తొలి దశలోనే గుర్తించి నియంత్రించకపోతే నష్టం తప్పదని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్‌లో అధిక వర్షాల కారణంగా పత్తి, తెగుళ్లు ఆశించి మిర్చి పైర్లు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆరుతడి పంటగా రబీలో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేపట్టారు. గత ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో 18,272 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది ఆ విస్తీర్ణం 24 వేల ఎకరాలకు చేరింది. మరో రెండు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కొన్ని చోట్ల పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. సాగు విస్తీర్ణంలో ఇప్పటికే 10 నుంచి 20 శాతం వరకు పంటను కత్తెర పురుగు ఆశించిందని రైతులు అంటున్నారు.
పెరిగిన పెట్టుబడులు
ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు నెట్టుబడులు పెరిగాయి. సాధారణంగా ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా పెట్టుబడి ఖర్చవుతోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచే కత్తెర పురుగు ఆశించటంతో రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక్కో రైతు మూడు నుంచి నాలుగు పార్లు మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో కేవలం మందులకే రూ.10 వేలకు పైగా అదనంగా ఖర్చు చేస్తున్నారు.
యాజమాన్య పద్ధతులు ఇలా..
సమగ్ర యాజమాన్య పద్ధతులతో కత్తెర పురుగులు నివారించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఎకరానికి 8 నుంచి పది వరకు లింగార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల కత్తెర పురుగు గుడ్లు, మొదటి దశ లార్వాను నాశనం చేయవచ్చు. తొలిదశలో పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్వినాల్‌ఫాల్ 400 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. రెండు, మూడు దశల్లో ఉధృతంగా ఉన్నప్పుడు పురుగును అరికట్టటానికి లీటరు నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ ఐదు శాతం ఎస్‌జీ మందును మిల్లీ లీటరు కలిపి ఎకరానికి 80 గ్రాముల మందును పిచికారీ చేయాలి. నాలుగు, ఐదు దశల్లో పురుగు నివారణకు విషపు ఎరలు వాడాలి. విషపు ఎరను సొంతగా తయారు చేసుకోవాలి. రెండు కిలోల బెల్లం, పది కిలోల తవుడు మిశ్రమానికి రెండు లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పంట పొలంలో వాడటానికి అరగంట ముందు దానికి వంద గ్రాముల లథయోడికర్ అనే మందును కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకుని మొక్క సుడి భాగాల్లో వేయాలి.
మొక్కజొన్న పైరును ఆశించిన
కత్తెర పురుగు
ఎన్టీఆర్ జిల్లాలో 24 వేల
ఎకరాల్లో మొక్కజొన్న సాగు
ఇప్పటికే 10 నుంచి 20 శాతం
పంటను ఆశించిన పురుగు
దిగుబడులపై రైతుల ఆశకు కత్తెర


