
కన్నీటి ధార!
బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. తులం బంగారం లక్ష మార్కు దాటేసింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు బంగారు ఆభరణాల తయారీ కార్మికులు మాత్రం పనులు లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న చిన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వాణిజ్య రాజధానిగా పిలిచే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కార్మికులపై దాని ప్రభావం అధికంగా పడుతోంది.
బంగారు ఆభరణాల తయారీ కార్మికులకు ‘ధరా’ఘాతం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 40 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పాతబస్తీలో సుమారుగా 50 సముదాయాల్లో ఐదు నుంచి ఆరు వందలకు పైగా, గవర్నర్‌పేట బీసెంట్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో మరో రెండు వందలకు పైగా కార్ఖానాలు కొనసాగుతున్నాయి. సుమారుగా 25 వేల మంది కార్మికులు వీటిపై ఆధారపడి ఉన్నారు. ఇవి కాకుండా రెండు జిల్లాలో పెద్ద స్థాయిలో ఆభరణాల తయారీ చేసే మరో వంద వరకూ కార్ఖానాలు పని చేస్తున్నాయి. వీటిల్లో ఏడెనిమిది వేల మంది వరకూ కార్మికులు పని చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద ఆభరణాల తయారీ చేసే వారి సంఖ్య సైతం ఏడెనిమిది వేల వరకూ ఉంటుంది. వీరిలో సుమారు ఏడు నుంచి పది వేల మంది బెంగాల్ కార్మికులు ఉన్నట్లు అంచనా.
పనులు లేక ఆత్మహత్యలు..
పనులు లేక బంగారు ఆభరణాల తయారీ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కొంతమంది కార్మికులు పనులు లేక ఆదాయం రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. యనమలకుదురులో ఒక కార్మికుడు ఆభరణాల తయారీకి వినియోగించే సైనెడ్‌ను కూల్‌డ్రింక్‌లో కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే పనులు లేకపోవటంతో చాలా మంది ఈ రంగాన్ని వదిలి ఇతర రంగాలకు తరలిపోతున్నారని వారు వాపోతున్నారు.
బహుళజాతి సంస్థలతో తీవ్ర ప్రభావం..
దశాబ్దం క్రితం వరకూ స్వర్ణకారుల జీవితాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోయాయి. దాదాపుగా అందరికీ చేతినిండా పనులు ఉండేవి. కానీ పది సంవత్సరాలుగా బహుళజాతి సంస్థల కారణంగా స్థానికంగా పనులు తగ్గి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. ముఖ్యంగా చాలా సంస్థలు ఉత్తరాది నుంచి ఆభరణాలను తయారు చేయించుకొని దిగుమతి చేసుకుంటున్నాయి. విస్తృత ప్రచార ఆర్భాటాలు, ఆకర్షించే దుకాణ సముదాయం, ఆకట్టుకునే రాయితీలు, భారీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి రావటంతో స్వర్ణకారుల బతుకు చిత్రం భారంగా మారింది.
పని బంగారం.. బతుకు నిస్సారం
పసిడి ధర భారీగా పెరగడంతో దిగజారిన కొనుగోళ్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన ఆభరణాల తయారీ పనులు పనులు లేక అవస్థలు పడుతున్న కార్మికులు వేరే పనులు చూసుకుంటున్న స్వర్ణకారులు

కన్నీటి ధార!

కన్నీటి ధార!