యువతి మృతికి కారణమైన వ్యక్తికి ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

యువతి మృతికి కారణమైన వ్యక్తికి ఐదేళ్ల జైలు

Nov 18 2023 1:56 AM | Updated on Nov 18 2023 1:56 AM

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): ప్రేమించిన యువతిని వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమైన యువకుడికి ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధిస్తూ ఐదవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఐ.శైలజాదేవి శుక్రవారం తీర్పు వెల్లడించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన గాయత్రి, కొత్తపేటకు చెందిన చేబ్రోలు వంశీ ఆనంద్‌ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో వారి పెళ్లి విషయం మాట్లాడగా వంశీ అనంద్‌ అన్నయ్యకు పెళ్లి అయిన తరువాత పెళ్లి చేస్తామని కుటుంబ పెద్దలు చెప్పారు. ఈ క్రమంలో గాయత్రి నగరంలోని ఒక షాపులో పని చేస్తుండగా వంశీ ఆనంద్‌ ఆమైపె అనుమానం పెంచుకుని వేధింపులకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో 2017 ఆగస్టు 4వ తేదీ గాయత్రి డ్యూటీ ముగించుకుని వస్తున్న సమయంలో వంశీ ఆమెను అడ్డగించి నువ్వు వేరే వాడితో తిరుగుతున్నావు అని, నిన్ను పెళ్లిచేసుకోనని ఆమెను కొట్టి, సెల్‌ఫోన్‌ లాక్కొని వెళ్లిపోయాడు. ఈ ఘటనతో గాయత్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యి జరిగిన విషయం ఆ రోజు రాత్రి ఆమె తల్లికి, సోదరికి చెప్పింది. ఈ విషయంపై వంశీతో మాట్లాడతామని సర్ధిచెప్పి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లో వారు బయటకు వెళ్లిన సమయంలో గాయత్రి ఫ్యాన్‌కు చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను వంశీ అనుమానంతో వేధింపులకు ప్పాడటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 సెప్టెంబర్‌ 7వ తేదీన పరారీలో ఉన్న వంశీని అరెస్టు చేసి న్యాయస్ధానంలో హాజరుపరిచారు. ఈ కేసులో 14 మంది సాక్షులను విచారించగా నిందితుడిపై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

సినీ ఫక్కీలో నగదు దోపిడీ

వెంబడించి నిందితుడిని పట్టుకున్న బాధితుడు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రా చేసుకుని బైక్‌పై వెళుతున్న వ్యక్తి నుంచి సినీ ఫక్కీలో దుండగులు నగదు దోపిడీ చేసిన ఘటన హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. విజయవాడరోడ్డులోని పుట్టగుంట పున్నమ్మ కాంప్లెక్స్‌లో ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో లారీ ట్రాన్స్‌ఫోర్ట్‌ వ్యాపారి గిరి రూ. 2 లక్షల నగదు విత్‌ డ్రా చేసుకున్నాడు. ఈ నగదును తన ద్విచక్రవాహనానికి ఉన్న సైడ్‌ బాక్స్‌లో భద్రపర్చాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన దుండగుడు గిరి బైక్‌పై వెళుతుండగానే అదును చూసుకుని సైడ్‌ బాక్స్‌లో నుంచి నగదు అపహరించాడు. దీన్ని గుర్తించిన గిరి కేకలు వేస్తూ బైక్‌ ఆపి దుండగుడిని వెంబడించాడు. ఇంతలో ఆ కూడలిలో ఉన్న స్థానికులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి దుండగుడి వెంటపడ్డారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఏడీఎల్‌ జనార్ధన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement