కాగజ్‌నగర్‌లోనే.. | - | Sakshi
Sakshi News home page

కాగజ్‌నగర్‌లోనే..

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 80 శాతానికి పైగా సిజేరియన్లు నిబంధనలు పాటించని యాజమాన్యాలు అడ్డూఅదుపు లేకుండా ఆపరేషన్లు గర్భిణుల ఆరోగ్యంతో చెలగాటం

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు కాసులకు కక్కుర్తి పడి అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అమాయకుల కడుపు కోసి డబ్బులు సంపాదిస్తున్నాయి. మహిళల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ నివేదికల ప్రకారమే ప్రైవేట్‌ ఆస్పత్రులో ఏకంగా 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. జిల్లాలో 24 ప్రభు త్వ ఆస్పత్రులు, 8 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ 31 వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1837 ప్రసవాలు కాగా, ప్రైవేటులో 1097 డెలివరీలు అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1128 నార్మల్‌ డెలివరీలు జరిగితే.. 709 సిజేరియన్‌ ఉన్నాయి. కానీ ప్రైవేటులో మాత్రం కేవలం 212 మాత్రమే సాధారణ ప్రసవాలు ఉన్నాయి. మిగిలిన 885 సిజేరియన్‌ ఆపరేషన్లు జరిగాయి. కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అయితే 107 మంది ప్రసవం కోసం వస్తే అందులో 104 మందికి సిజేరియన్లు, కేవలం ముగ్గురికి మాత్రమే నార్మల్‌ డెలివరీలు చేశారు. అంటే 97 శాతం అక్కడ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. మరో ప్రైవేటు ఆస్పత్రిలోనైతే గైనకాలజిస్టు లేకుండానే ప్రసవాలు చేసేస్తున్నారు.

తల్లులకు ఆరోగ్య సమస్యలు

కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మనీరు పూర్తిగా లేకపోవడం, గర్భిణికి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి సందర్భాలలో తల్లీబిడ్డను కాపాడాలనే ఉద్దేశంతో సిజేరియన్లు చేస్తుంటారు. అయితే కొన్ని ఆస్పత్రుల్లో నొప్పులొస్తున్నాయంటే చాలు అడ్మిట్‌ చేసుకుని ఆపరేషన్లు చేసేస్తున్నారు. దీంతో తల్లులు బలహీనంగా మారి కనీసం నెల, రెండు నెలల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సమయంలో 1800 పైగా ప్రసవాల్లో కేవలం 700 వరకు మాత్రమే సిజేరియన్లు చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ దృష్టి సారించి, సిజేరియన్ల శాతం 20 దాటిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్‌ శాతం ఎక్కువగా ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. నిబంధనలు పాటించని ప్రతీ ప్రైవేటు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుటాం. గర్భిణులకు సాధారణ ప్రసవమే సురక్ష. నిబంధనలు పాటించని అస్పత్రుల లైసెన్సు రద్దు చేయడానికి కూడా వెనకాడం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

– నాగేందర్‌ సిడాం, డీఎంహెచ్‌వో

జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు మొత్తం కాగజ్‌నగర్‌ పట్టణంలోనే ఉన్నాయి. మారుమూల మండలాల ప్రజలు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు 61.4 శాతం ఉండగా, సిజేరియన్లు 38.6శాతం ఉన్నాయి. కానీ ప్రైవేటులో మాత్రం సిజేరియన్‌ 80.7 శాతం దాటగా, నార్మల్‌ డెలివరీలు కేవలం 19.3 శాతంగా ఉన్నాయి. అవసరమైతేనే ఆపరేషన్లు చేస్తున్నామని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నా.. ప్రైవేటు ఆస్పత్రులు ధనదాహంతో విచ్చలవిడిగా సిజేరియన్లు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రసవం జరిగితే అదే రోజు లేదా మరుసటి రోజు డిశ్చార్జి చేస్తారు. కానీ సిజేరియన్‌ పేరుతో ఐదారు రోజుల వరకు ఆస్పత్రిలో ఉంచుకుంటున్నారు. సాధారణ ప్రసవానికి రూ.35 వేలు, సిజేరియన్లకు రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలకు అనుగుణంగా కొన్నిచోట్ల వసూలు చేసే మొత్తం మరింత ఎక్కువగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement