ఎల్‌నినో నేపథ్యంలో ‘వీబీజీ రామ్‌జీ’పై ప్రభుత్వం దృష్టి జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కూలీల సంఖ్య వ్యవసాయ పనులు పూర్తయితే హాజరు రెండింతలయ్యే అవకాశం
తిర్యాణి: జిల్లాలో వ్యవసాయ పనుల సీజన్ కొనసాగుతున్న వేళ వీబీ జీ రాంజీ(ఉపాధిహామీ) పనులు సైతం జోరందుకున్నాయి. సాధారణంగా డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభమయ్యే పనులు.. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో ముందే మొదలయ్యాయి. ఓ వైపు పత్తితీత పనులు కొనసాగుతున్నా వేతనాలు త్వరగా అందుతాయనే ఆశతో కూలీలు ఉపాధి బాట పడుతున్నాయి. గతంలో ఇదే సీజన్‌లో కేవలం 4 వేల నుంచి 5 వేల మంది మాత్రమే హాజరుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య రెండింతలైంది. ఏకంగా 10 వేలకు చేరువగా హాజరు నమోదవుతోంది. ఈ నెల 4వ తేదీన రికార్డు స్థాయిలో 10,045 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. నిత్యం దాదాపు 9 వేలకు పైగా కూలీలు పనులకు వెళ్తున్నారు. ముఖ్యంగా దహెగాం మండలంలో రోజుకు 1000 మందికి పైగా కూలీలు హాజరవుతూ అగ్రభాగాన నిలవగా, అత్యల్పంగా సిర్పూర్(యు)లో 350 మంది కూలీలు వెళ్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ కుంటలు, ఇంకుడు గుంతలు, ఫాంపాండ్లు వంటి దీర్ఘకాలిక ప్రయోజనకరమైన పనులపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పత్తితీత పనులు పూర్తయితే రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగినట్లుగా అధికారులు ఎస్టిమేషన్లు సిద్ధం చేస్తున్నారు.
సెమీ స్కిల్డ్ వర్కర్లుగా మేట్లు..
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం నుంచీ మేట్లు కూలీలకు పనులు కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కూలీల హాజరు నమోదు, పనులు చేయిస్తున్నా అన్‌స్కిల్డ్ లేబర్లుగానే పరిగణించేవారు. కానీ నూతనంగా వచ్చిన వీబీజీ రామ్‌జీ పథకంలో మేట్లను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. తద్వారా పని దినాలతో సంబంధం లేకుండా మేట్ సంవత్సరం అంతా (365 రోజులపాటు) పనికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గతంలో మాదిరి కూలీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కో మేటు 20 నుంచి 40 మంది కూలీలతో పని చేయించడం, కూలీల హాజరు నమోదు చేయడం, కొలతలు ఇవ్వడం వంటివి చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 2,126 మంది మేట్లు ఈ పథకంలో పనిచేస్తున్నారు. గరిష్టంగా 40 మంది కూలీలకు ఒక్కో మేట్ అవసరం ఉండటంతో మేట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీబీజీ రామ్‌జీలో నూతనంగా కొన్ని పనులు ప్రవేశపెట్టగా, ఆన్‌లైన్ హాజరు లాంటి అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం
వీబీజీ రామ్‌జీలో భాగంగా చేపట్టబోయే పనులు, ఆన్‌లైన్ హాజరు నమోదు అంశాలపై క్షేత్రస్థాయిలో మేట్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. రానున్న నెలల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే పలు పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లు పూర్తి చేశాం. ఈసారి ఎక్కువగా నీటి సంరక్షణకు సంబంధించిన పనులు చేపడుతున్నాం. – షాకీర్ ఉస్మాని,
అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్, వీబీ జీ రామ్‌జీ
‘జలసిరి’పై ప్రత్యేక ఫోకస్...
జిల్లాలో మొత్తం 1.23 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, ఇందులో 2.45 లక్షల కూలీలు ఉన్నారు. అయితే యాక్టీవ్ జాబ్‌కార్డులు 86 వేలు ఉండగా, 1.57 లక్షల యాక్టీవ్ కూలీలు నమోదయ్యారు. జిల్లాలో సరాసరి కూలీ రేటు రూ.281 ఉండటంతోపాటు, దాదాపుగా వేతనాలు పనిచేసిన 15 రోజుల్లోనే పడుతున్నాయి. ప్రస్తుతం వీబీజీ రామ్‌జీ పథకంలో నడుస్తున్న పనులను పరిశీలిస్తే అధికశాతం జలసిరి కార్యక్రమానికి సంబంధించిన పనులే ఉన్నాయి. నీటి సంరక్షణ కుంటలు, సామూహిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, ఫాంపాండ్లు, చిన్న ఊట కుంటలు, నేల సంరక్షణ పనులు, పశువుల నీటి తొట్టీలు, పశువుల షెడ్లు, కందకాలు వంటి పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మరో నెలరోజుల్లో జిల్లాలో పత్తితీత పనులు పూర్తి కానుండగా, గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్లు అధికారులు ఇప్పటి నుంచే నూతన పనులకు సంబంధించిన ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.


