ఆసిఫాబాద్‌అర్బన్: సమాజంలో శాంతి విస్తరణకు బుద్ధుడి బోధనలు అవసరమని బౌద్ధ వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దీక్షా భూమిలో గురువారం 70వ ధమ్మచక్ర పరివర్తన్ దివస్ ఘనంగా నిర్వహించారు. జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన అంబేడ్కరిస్టులు, నాయకులు, భారతీయ బౌద్ధ సంఘం, ఇతర సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే స్థానిక లుంబిని దీక్షాభూమిలో పంచశీల జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రిపూట కవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, భారత రక్షణ దళం వ్యవస్థాపకుడు రెంజర్ల రాజేష్, నాయకులు శ్యాంనాయక్, సిద్దార్థ రామ్మూర్తి, భాస్కర్, అశోక్ మహాల్కర్, ప్రశాంత్, దుర్గం ప్రశాంత్, తుకారాం, దుర్గం శ్యాంరావు తదితరులు హాజరయ్యారు.


