ప్లాట్‌ఫాం.. పరేషాన్‌! | - | Sakshi
Sakshi News home page

ప్లాట్‌ఫాం.. పరేషాన్‌!

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ మూడో ప్లాట్‌ఫాంపై నిత్యం రద్దీ ప్రయాణికులు వేచి చూసేందుకు నీడ కరువు కౌంటర్‌ లేక టికెట్‌ బుకింగ్‌కు అవస్థలే.. మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయని వైనం

ఆసిఫాబాద్‌క్రైమ్‌: జిల్లాలోనే అతి పెద్దదైన కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా మూడో ప్లాట్‌ఫాంపై నిలువ నీడ లేకుండా పోతోంది. కనీసం అత్యవసర సమయంలో వెళ్లేందుకు మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే స్టేషన్‌లో ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

ఎండలోనే నిరీక్షణ

ప్రతిరోజూ మధ్యాహ్నం మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుండగా, వారికి నిలబడేందుకు ఆశించిన స్థాయిలో షెడ్లు, కుర్చీలు లేవు. రైలు వచ్చే వరకు ఎండ, వానలోనే నిలబడాల్సిన పరిస్థితి. ప్రధానంగా వృద్ధులు, రోగులు, మహిళలు, చిన్నారులు మరింత అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం కేవలం 4, 5 చిన్న షెడ్లు ఉన్నాయి. అందులో ఓ షెడ్డు కింద 10 నుంచి 15 మందికే స్థలం సరిపోతుంది. మరోవైపు మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేకపోవడం సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. దూర ప్రయాణాలు చేసే వారు ఈ విషయంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

బుకింగ్‌కు ఇబ్బందులే..

మరో వైపు మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ లేకపోవడంతో ప్రయాణికుల బాధలు వర్ణణాతీతంగా మరాయి. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైనే బుకింగ్‌ కౌంటర్లు ఉన్నాయి. ప్రయాణికులు మూడో నంబర్‌ నుంచి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి, దిగిన తర్వాత టికెట్‌ తీసుకొని తిరిగి అదే మార్గంలో మూడో ప్లాట్‌ఫామ్‌కు చేరుకోవాలి. ఇందుకోసం ప్రయాణికుల సమయం, శ్రమ వెచ్చించాల్సి వస్తోంది. ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (సికింద్రాబాద్‌)ను గోపాలకృష్ణను ఫోన్‌ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

స్టేషన్‌లో కీలకం

కాగజ్‌నగర్‌ స్టేషన్‌లో మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ అత్యంత ముఖ్యమైంది. ఈ ప్లాట్‌ఫాం మీదుగా పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కాగజ్‌నగర్‌ నుంచి వయా సికింద్రాబాద్‌ బీదర్‌ వరకు రైలు నంబర్‌ : 17011–12 (ఇంటర్‌సిటీ బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌), కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు రైలు నంబర్‌ : 12757–58 (కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌), కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు రైలు నంబర్‌: 17233–34 (భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌), కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు రైలు నంబర్‌: 07711–12 (కాగజ్‌నగర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌) నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నాలుగు రైళ్ల నుంచి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ వైపు, కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు ప్రయాణాలు చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లేవారిలో దాదాపు 40 శాతం ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌ నంబర్‌–3లో వచ్చే నాలుగు రైళ్ల సేవలనే వినియోగించుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement