ఆసిఫాబాద్‌రూరల్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు కుమురంభీం(అడ) ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రజల కు ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆరు టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఏ డాదికి రెండు టీఎంసీలు వినియోగించే అవకాశం ఉంది. వర్షాలు ఆలస్యమైనా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాతోపా టు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ప్రాజెక్టు నుంచే నీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
1,876 గ్రామాలకు భగీరథ నీరు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ముందస్తు చర్యల కు సిద్ధంగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటికి అడ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. జిల్లా కేంద్రంలోని అడ ప్రాజెక్టు నుంచి ప్రతిరోజూ 135 ఎంఎల్‌డీ వాటర్‌ను మానిక్‌గూడ భగీరథ వాటర్ బెడ్‌లో శుద్ధి చేసి మూడు జిల్లాల పరిధిలోని 27 మండలాల పరిధిలోని 1,876 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉంది. జిల్లావ్యాప్తంగా భగీరథ ద్వారా ఏడాదిపాటు తాగునీరు అందించేందుకు రెండు టీఎంసీలు సరిపోతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏటా ఎండకాలంలో నీటిమట్టం తగ్గిపోయి తాగునీటి సమస్యలు తలెత్తే 122 గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాలకు ఎలాంటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. తాగునీటి సమస్య తలెత్తితే 24 గంటల్లోగా పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇతర జిల్లాలకు సైతం..
ఆసిఫాబాద్ మండలంలోని మానిక్‌గూడ భగీరథ వాటర్ గ్రిడ్ నుంచి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలోని కొన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలకు ఇక్కడి నుంచి 220 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఉంది. మంచిర్యాల జిల్లాలోని ఏడు మండలాలకు 120 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఉంది. ఇక కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాలకు 100 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ ద్వారా ప్రతిరోజూ 135 మిలియన్ లీటర్ల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా భగీరథ నీటిని అందిస్తున్నారు.
సమస్య రాకుండా చర్యలు
వర్షాభావ పరిస్థితులతో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. భగీరథ ద్వారా నిరంతరం తాగునీరు అందించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశాం. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.
– రాజేశ్, భగీరథ గ్రిడ్ ఈఈ


