ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. క్షతగాత్రులకు పీఎం రహత్ పథకం కింద ఉచితంగా చికిత్స అందించే అవకాశం ఉందన్నారు. రహదారులపై గుంతలు పూడ్చాలని, మూలమలుపుల వద్ద చెట్ల కొమ్మలు, చెట్లు తొలగించాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోడ్లపై పశువులు సంచరించకుండా యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నెలరోజుల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
గంజాయి సాగు, రవాణా అరికట్టాలి
జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం మాదక ద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన సమావేశానికి ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సమీక్షించారు. హోటళ్లు, దాబాల్లో తనిఖీలు చేపట్టాలని, మందుల షాపుల్లో నిషేధిత, అధిక మోతాదు మందులను పరిశీలించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని ప్రజలకు, నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా పాఠశాలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్‌లో గంజాయి సాగు, రవాణాపై తనిఖీలు చేపట్టి 16 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, జిల్లా పంచాయతీ అధికారి భిక్షతిగౌడ్, డీటీడీవో అంబాజీ, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర, జిల్లా మాధ్యమిక విద్యాధికారి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


