ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడమే తమ లక్ష్యమని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో గురువారం ఎఫ్‌డీవో అప్పయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో జిల్లావ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా ఎకరాల్లో అటవీ భూమి ఉండేదని తెలిపారు. ఇప్పటివరకు 33వేల హెక్టార్లకు అటవీ హక్కుపత్రాలు అందించారని, దీనికంటే ఎక్కువగా 38 వేల హెక్టార్లలో అక్రమ పోడు సాగు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకుని మొక్కలు పెంచినట్లు తెలిపారు. తద్వారా సిర్పూర్ ప్రాంతంలో పులులు, ఇతర జంతువుల సంచారం పెరిగిందని స్పష్టం చేశారు. కెరమెరి, లింగాపూర్ వంటి కోర్ ఏరియాలో భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా చెట్లు పెంచనున్న ట్లు వివరించారు. ఇప్పటివరకు అటవీ ప్రాంతాల్లో 456 కిలోమీటర్ల మేర అక్రమంగా వేసిన విద్యుత్ వైర్లు గుర్తించామన్నారు. అడవుల గుండా వెళ్లే తీగల కు రబ్బర్ తొడుగులు వేసేందుకు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. నాలుగేళ్లలో వేర్వేరు అటవీ ప్రాంతాల్లో విద్యుత్ వైర్లకు 27 జంతువులు, 29 మంది మనుషులు బలైనట్లు వె ల్లడించారు. వీరికి రూ.85లక్షల పరిహారం అందించామని తెలిపారు. సింగరేణికి అప్పగించే భూములకు సైతం ఆ సంస్థ ఇతర చోట్ల అడవులు పెంచి అప్పగిస్తుందని పేర్కొన్నారు.


