జిల్లాలో ఐదు మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటన
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
వీబీ జీ రామ్‌జీ పనుల కల్పనకు అవకాశం
రైతులకు నేరుగా ప్రభుత్వ సాయం అందడం అనుమానమే..
కౌటాల: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోని జిల్లాలోని ఐదు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏ ఒక్క మండలాన్ని తీవ్ర కరువు ప్రాంతంగా గుర్తించకపోవడంతో రైతులకు నేరుగా సాయం అందే అవకాశాలు లేకుండా పోయాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, వీబీ జీరామ్ జీ పనిదినాల పెంపు, ఇతర తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కనీసం లోటు వర్షపాతం నమోదై, పంటలు ఎండుతున్న ప్రాంతాలనైనా కరువు మండలాలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 1103.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 1019.9 మీటర్ల వర్షం కురిసింది. మూడు మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా, జిల్లాలోని 15 మండలాల్లో కేవలం ఐదు మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించడం గమనార్హం.
అడుగంటుతున్న నీటి వనరులు
ప్రస్తుతం జిల్లాలోని వార్దా, పెద్దవాగు, వైన్‌గంగ, పెన్‌గంగ నదుల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. చెరువులు సైతం ఎండుతున్నాయి. చివరిదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వరికి సాగు నీరందక ఎండిపోతోంది. యాసంగి సీజన్‌లో పంటలు సాగునీటి విడుదల ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయంగా మక్క, శనగ, మినుము, సోయా, జొన్న, కంది తదితర ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను సిద్ధం చేస్తున్నారు.
కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఎండిపోయిన వార్దా నది
జిల్లాలోని మధ్యస్థ కరువు మండలాలు
కౌటాల,చింతలామనెపల్లి
బెజ్జూర్, జైనూర్,సిర్పూర్(యు)
జూన్ నుంచి అక్టోబర్ 28 వరకు
వర్షపాతం(మి.మీ.లలో)
మండలం కురవాల్సింది కురిసింది శాతం(స్థితి)
జైనూర్ 1168.5 1180.2 1.0 సాధారణం
సిర్పూర్(యు) 1060.2 1077.9 –7 సాధారణం
లింగాపూర్ 1106.8 1153.5 4 సాధారణం
తిర్యాణి 1001.7 1013.7 1.0 సాధారణం
రెబ్బెన 955.9 937.1 – 2 సాధారణం
ఆసిఫాబాద్ 993.7 960.8 – 3 సాధారణం
కెరమెరి 992.1 1163.2 17 సాధారణం
వాంకిడి 1049.9 928.0 – 12 సాధారణం
కాగజ్‌నగర్ 1013.5 882.7 – 13 సాధారణం
సిర్పూర్(టి) 1150.0 893.1 – 22.0 లోటు
కౌటాల 1150.0 862.1 – 27.0 లోటు
చింతలమానెపల్లి 1191.9 884.5 – 26.0 లోటు
బెజ్జూర్ 1255.6 1197.3 – 5 సాధారణం
పెంచికల్‌పేట్ 1161.5 1160.8 00 సాధారణం
దహెగాం 1164.8 1002.6 – 14 సాధారణం
సాయం కష్టమేనా..!
కరువు ప్రాంతాలను గుర్తించేందుకు అధికారులు మొదట శాటిలైట్ మ్యాపులు, వర్షపాతం, నీటి వనరుల్లో జలాలు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ అంశాల ఆధారంగా కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రతిపాదించింది. తీవ్రమైన కరువు మండలాలకే సాయం అందే అవకాశాలు ఉన్నాయి. తద్వారా జిల్లా రైతులకు నిరాశే ఎదురుకానుంది. 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల్లో లోటు ఉంది. మధ్యస్థ కరువు మండలాల్లో వ్యవసాయశాఖ చేపట్టే యాక్షన్ ప్లాన్ వివరాల కోసం డీఏవో బి.వెంకట్‌ను ‘సాక్షి’ సంప్రదించగా ఆయన స్పందించలేదు.


