చేలలో తీతకు సిద్ధంగా పత్తి పంట పలు ప్రాంతాల్లో కోత దశలో వరి పొలాలు వర్షాభావం ఉన్నా చినుకులు పడితే నష్టమే.. ఆందోళనలో అన్నదాతలు
రెబ్బెన/కౌటాల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే దశలో రైతులను అర్నబ్ తుపాను కలవరపెడుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈసారి పంటల్లో దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. తుపాన్ ప్రభావం జిల్లాపైనా ఉంటుందనే అంచనా నేపథ్యంలో రైతుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. పలు ప్రాంతాల్లో చేలు ఎండుతున్నాయి. కానీ ఈ పరిస్థితిలో వర్షం పడితే ఆశాజనకంగా ఉన్న పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 1.26 లక్షల మందికి పైగా రైతులు జిల్లావ్యాప్తంగా 4.40 ఎకరాల్లో వానాకాలం సీజన్‌లో పంటలు సాగు చేశారు. అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి, 54 వేల ఎకరాల్లో వరి సాగైంది.
పత్తి రైతుల అయోమయం
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలో పూత నిలిచినా చోట కూడా కాయల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు సగటు దిగుబడి ఉండగా ఈసారి పరిస్థితి మరీ అధ్వానంగా మారనుంది. ఎకరానికి 3 క్వింటాళ్ల వరకు రావడమే కష్టతరంగా మారింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా రైతులు అయోమయ పరిస్థితుల్లో పడ్డారు. ఓ వైపు చేలు ఎండిపోతున్నా.. తుపాను ప్రభావంతో వర్షం పడితే పత్తి నల్లబడుతుందని ఆందోళన చెందుతున్నారు. 80 శాతం పంట మొదట దశ ఏరేందుకు సిద్ధమైంది. కూలీల కొరత కారణంగా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. వర్షం పడితే చేతికందే దశలోని పంట చెట్టుపైనే తడిసి నాణ్యత దెబ్బతింటుంది. కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలతోపాటు జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యాపారులు సైతం ఆసక్తి చూపరు.
వరి పంటదీ అదే పరిస్థితి
రెబ్బెన మండలంలో యాసంగి సాగుకు వీలుగా వానాకాలం ముందస్తుగానే వరినాట్లు వేసుకున్నారు. అందుబాటులో సాగునీటి వసతి ఉన్న ఇందిరానగర్, గంగాపూర్, నంబాల, కొమురవెళ్లి తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం కోతదశకు చేరుకుంది. హార్వెస్టర్ యంత్రాల కొరతతో కోతలు ముందుకు సాగడం లేదు. కొందరు ఇప్పటికే కోతలు పూర్తి చేసుకున్నారు. ఈ సారి సన్నరకం వరి ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండంతో కాస్త లాభాలను చూస్తామని ఆశించిన రైతులకు అర్నబ్ తుపాన్ గుబులు పుట్టిస్తోంది. కోసేందుకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో వర్షానికి తోడు చిన్నపాటి గాలి వీచినా పంటంతా నేలకొరి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.


