జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొదలైన వరి కోతలు ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పచ్చి వడ్లనే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
రెబ్బెన: ఎల్‌నినోతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు పంటలను తీవ్రంగా దెబ్బతిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చేతిదాక వచ్చిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అయితే సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేసిన సన్నరకం ధాన్యానికి ఊ హించని ధర పలుకుతోంది. ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశన్నంటుతుండటంతో సన్నరకం వరిధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఎగబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థా యిలో ధర చెల్లిస్తూ కల్లాల వద్ద నుంచే తీసుకెళ్తున్నా రు. తేమ, తప్ప, తాలు వంటి ఎలాంటి కొర్రీలు పె ట్టకుండానే కొంటున్నారు. తూకం, రవాణా చార్జీల ను సైతం వారే భరిస్తున్నారు. ఈసారి బియ్యానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎలాంటి నిబంధనలు లేకుండా పచ్చివడ్లకే అధిక ధర చెల్లిస్తున్నారు.
జిల్లాలో మొత్తం సన్నాలే..
వానాకాలం సీజన్ ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం వరి ఏడు సన్నరకాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో జిల్లాలోని రైతులు దాదాపు ఈ రకాలనే ఎంచుకుని వరిసాగు చేపట్టారు. ఈసారి వానాకాలంలో జిల్లాలో సుమారు 50వేల ఎకరాల వరకు వరిసాగు చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కించింది. గతేడాది పోల్చితే సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది రైతులు వరిసాగు వదులుకుని ఇతర పంటలను పండిస్తున్నారు.
నెలరోజుల్లో వరికోతల జోరు
జిల్లాలో వరికోతలు మరో నెలల్లో జోరందుకోనున్నాయి. ముందస్తుగా నాట్లు వేసిన వారు ఇప్పటికే కోతలను పూర్తి చేశారు. ఆలస్యంగా నాట్లు వేసిన వారికి కొంత ఇబ్బందులు ఉన్నాయి. వినాయక చవితి నుంచి వర్షాలు ముఖం చాటేయడంతో పాటు ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు ఇంకిపోతుండటంతో చివరి తడులు అందించేందుకు తంటాలు పడుతున్నారు. ఆయిల్ ఇంజిన్లు, ట్రాక్టర్ ఇంజిన్లకు మోటర్లు బిగించి కుంటల్లో అడుగంటిన నీటిని తోడి పారిస్తున్నారు. ఒక్క తడి అందితే పంట చేతికందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
నంబాల శివారులో కోతకు సిద్ధంగా వరిపొలం
జిల్లాలో ఇప్పటికే ముందస్తు వరికోతలను పూర్తి చేసుకున్న రైతుల వద్ద నుంచి ప్రైవేటు వ్యక్తులు క్వింటాల్‌కు రూ.3,200 నుంచి రూ.3,400 వర కు చెల్లిస్తున్నారు. ఇక తినేందుకు అనుకూలమైన జైశ్రీరాం, హెచ్‌ఎంటీ వంటి రకాలకు రూ.3800 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తు తం మార్కెట్‌లో బియ్యం ధరలు రూ.8,000 నుంచి రూ.9,500 వరకు ఉండటంతో సన్నరకం ధాన్యానికి డిమాండ్ పెరిగింది. గతేడాది తెలంగాణ సోనా రకం ధాన్యానికి రూ.2,000 నుంచి రూ.2,100 వరకు చెల్లించగా ఈసారి ఏకంగా రూ.3200పైనే చెల్లిస్తున్నారు. రైతుల వద్దకే వచ్చి పచ్చి వడ్లనే అధిక ధరకు కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు పోటీ పడుతున్నారు.


