సాగు తీరు మారేనా..? | - | Sakshi
Sakshi News home page

సాగు తీరు మారేనా..?

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● యాసంగి సాగుపై వర్షాభావ పరిస్థితుల ప్రభావం ● ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం

పెంచికల్‌పేట్‌: జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం ఖరీఫ్‌ పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు యాసంగి సాగుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ప్ర త్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. రైతువేదికల్లో అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు. అన్నదాతలను ఆరుతడి పంటల వైపు మళ్లించడానికి ప్రతీ వారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లోనూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన సదస్సులు

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 1103 మిల్లీమీటర్ల సాధారణ వర్షానికి 1019 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మారిన పరిస్థితులు, పొడి వాతావరణంతో జలవనరులు ఎండిపోతున్నాయి. పంటలకు సరిపడా సాగునీరు లేక అన్నదాతలు కలవరపడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులను యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తక్కువ నీటితో పండే కంది, జొన్న, పెసర్లు, శనగలు, పప్పు ధాన్యాలు, ఇతర చిరుధాన్యాల పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. నీటి లభ్యత, విత్తనాల ఎంపిక, స్వల్పకాలిక పంటల సాగుతో మెరుగైన దిగుబడులు సాధించవచ్చిన వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

అందుబాటులో విత్తనాలు

గతేడాది యాసంగి సీజన్‌లో మొత్తం 57,598 విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అప్పుడు 23,992 ఎకరాల్లో వరి పండించగా, ఈసారి కేవలం 8500 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే 75క్వింటాళ్ల శనగ, 30 క్వింటాళ్ల పెసర్ల విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

గతేడాది యాసంగి సాగు

పంట ఎకరాలు

వరి 23,992

మొక్కజొన్న 9,101

గోధుమ 972

ఆయిల్‌పామ్‌ 330

ఇతర పంటలు 22,765

ఆరుతడి పంటలు వేయాలి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలు సాగు చేయొద్దు. తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు వచ్చే జొన్న, కంది, పెసర్లు, మినుములు, మొక్కజొన్న ఇతర చిరుధాన్యాలు సాగు చేయాలి. ఇప్పటికే రైతులకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. యాసంగిలో ఆరుతడి పంటలనే వేయాలి. – జాడి వెంకట్‌, డీఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement