ఆసిఫాబాద్‌అర్బన్: కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఈ నెల 26న నిర్వహించే కుమురంభీం వర్ధంతి కార్యక్రమానికి 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. డీఎస్పీ అశోక్‌తో కలిసి శనివారం జోడేఘాట్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు, సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణం, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ తదితర అంశాలపై పోలీసు అధికారులకు సూచనలు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత చర్యలు సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, కెరమెరి ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


