నేటి నుంచి కుష్ఠు అనుమానితుల గుర్తింపు సర్వే ఇంటింటికీ రానున్న వైద్యసిబ్బంది నిర్ధారణ పరీక్షలకు ప్రజలు ముందుకొస్తేనే ప్రయోజనం జిల్లాలో 153 మంది వ్యాధిగ్రస్తులు
కౌటాల: జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కుష్ఠు మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగ్యశాఖ గురువారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టనుంది. రాష్ట్రంలో అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి విస్తరణను అడ్డుకునే దిశగా అనుమానితులను గుర్తించనున్నారు. 2028 నాటికి కుష్ఠు రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో 153 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని ఆరెగూడ, కౌటాల మండలం కన్నెపల్లి, ముత్తంపేట, చింతలమానెపల్లి మండలం గూడెం, దిందా, సిర్పూర్(టి) మండలం లోనవెల్లి, బెజ్జూర్, వాంకిడి, దహెగాం మండలాల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. గతేడాది 84 మంది బాధితులు ఉండగా, ఈ ఏడాది వారి సంఖ్య 153కు చేరింది.
నేటి నుంచి సర్వే..
జిల్లా వైద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు కుష్ఠు సర్వే చేపట్టనున్నారు. 118 సబ్ సెంటర్ల పరిధిలో 728 మంది ఆశ వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరుగుతూ స్క్రీనింగ్ ద్వారా అనుమానితులను గుర్తించనున్నారు. చర్మంపై పాలిపోయిన, గోధుమ, రాగి రంగు మచ్చలు ఉండటం, కనుబొమ్మల వెంట్రుకలు రాలడం, చేతి వేళ్ల స్పర్శ కోల్పోయి వంకరపోవడం వంటి లక్షణాలు ఉంటే తెలియజేయాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే గుర్తించడం, వ్యాధి సోకిన వారికి పూర్తిస్థాయిలో ఎండీటీ చేయించడం ద్వారా అరికట్టవచ్చు. ప్రస్తుతం కాగజ్‌నగర్ పీహెచ్‌సీలో కుష్ఠు వ్యాధి నివారణ విభాగం ఉంది. గురు, శుక్రవారాల్లో లెప్రసీ సొసైటీ ఆధ్వర్యంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బాధితులకు ఉచితంగా మందులు అందిస్తున్నారు.
ముందుకు రాని బాధితులు
జిల్లాలో ఏటా వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ప్రభుత్వం వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. బహుళ ఔషధ చికిత్స ద్వారా తీవ్రతను బట్టి 6 నుంచి 12 నెలల్లో వ్యాధి పూర్తిగా నయమవుతుంది. కుష్ఠులో పీబీ (పాసిబాసిల్లరి), ఎంబీ (మల్టిబాసిల్లరి)గా కేసులు ఉంటాయి. పీబీ అంటే అనుమానిత వ్యక్తి శరీరంపై దద్దులు, రాగి వర్ణపు మచ్చలు, అవయవాల్లో స్పర్శ తక్కువగా ఉండడంతో పాటు ఇతర లక్షణాలతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎంబీ కేసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరికి వైద్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. చలి ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజలు వైద్య పరీక్షలు చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.


