విజయానికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

విజయానికి ప్రతీక

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

● నేడు దసరా ● జిల్లా వ్యాప్తంగా వేడుకలు ● రావణ దహనానికి ఏర్పాట్లు

ఆసిఫాబాద్‌: విజయానికి ప్రతీకగా నిలిచే దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకునేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్‌ అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయం వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ రావణాసురుడి పది తలల దిష్టిబొమ్మ ఏర్పాటు చేశారు. కేస్లాపూర్‌ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రావణాసురుడి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు భూమిని చదును చేశారు. మంగళవారం సాయంత్రం 5:15 గంటలకు కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయంలో షమీ పూజ, 6 గంటలకు ప్రముఖ కళాకారులతో స్వాగత కార్యక్రమం, 7:30 గంటలకు శ్రీరాముని ఎంపిక, రావణ దహనం, 8 గంటల నుండి ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ప్రాంగణం నుంచి ముఖద్వారం వరకు విద్యుద్దీపాలతో అలంకరణ, కషాయ తోరణాలు, షామియానాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆలయ మార్గంలోని పెద్దవాగు వంతెన వరకు ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రాజంపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రహదారిని, బూర్గుడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలు శుభ్రం చేశారు. అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భూమి చదును చేసి, లైటింగ్‌, సౌండ్‌ సిస్టం, పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసే శ్రీరాముడిని ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా తీయనున్నారు. ఎంపికై న శ్రీరాముడిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరిస్తారు. అనంతరం ప్రత్యేకంగా అమర్చిన రాకెట్‌ ద్వారా రావణుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. వేడుకలకు వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో తాగునీరు, ప్రసాదం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పురప్రముఖులతో పాటు పట్టణ ప్రజలు అధికసంఖ్యలో హాజరుకానున్నారు.

సొంతూళ్లకు పయనం

ఉద్యోగ, వ్యాపారాల రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉన్న జిల్లా వాసులు స్వస్థలాలకు చేరుకుంటుండగా ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో రెండు రోజులుగా ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం రాజశేఖర్‌ తెలిపారు. శరన్నవరాత్రులు, విజయదశమిని పురస్కరించుకుని మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ కొనుగోలు దారులతో సందడిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బంతిపూలు కిలో రూ.50కే లభించడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

విద్యుద్దీపాల అలంకరణలో కేస్లాపూర్‌ ఆలయం

షిర్డీ సాయిమందిర్‌లో..

విజయ దశమి పుణ్యతిథి పురస్కరించుకుని మంగళవారం ఉదయం పట్టణంలో సాయి ఉత్సవ విగ్రహంతో నగర సంకీర్తన, జోలి భిక్ష నిర్వహించనున్నారు. ఉదయం కాకడ హారతి, మంగళస్నానం, పంచామృతాభిషేకం, 9 గంటలకు సామూహిక అఖండ సాయి సచ్చరి త పారాయణం, పుస్తక పూజ, మంత్ర పుష్పం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. దసరా సందర్భంగా ఆలయంలో వాహన పూజ నిర్వహిస్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement