ఈ నెల 15న కోడిపందేలకు సంబంధించిన కేసుల్లో ఐదుగురిని బెజ్జూర్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
ఈనెల 18న బెజ్జూర్ మండలం సులుగుపల్లి శివారులోని గంగారాంగూడలో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మూడు పందెం కోళ్లు, రెండు కత్తులు, రూ.300 నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
కౌటాల: జిల్లాలో బతుకమ్మ, దసరా వేడుకులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న వేళ.. కొందరు ‘బరి’ తెగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కోడి పుంజుల కళ్లకు కత్తులు కట్టి జోరుగా పోట్లాట పెడుతున్నారు. ఈ పందెంలో రూ.లక్షల్లో బెట్టింగులు చేతులు మారుతుంటాయి. జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా నిత్యం రహస్యంగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. అరుదైన జాతుల్లోని కోళ్లను మాత్రమే పందేలకు వినియోగిస్తారు. వాటి ధరలు రూ.వేలల్లో ఉంటాయంటే నమ్మశక్యం కాదు. కోళ్ల పోషణకు రాగులు, సద్దులు, జీడిపప్పు, పిస్తా తదితర తృణ ధాన్యాలు తినిపిస్తారు. ఈ కోళ్లన్నీ ఇతర ప్రాంతాల నుండి వస్తాయి. పందేనికి ముందు వాటి కాళ్లకు కత్తులు కట్టి రంగంలోకి దించుతున్నారు. బరిలో తలపడే పుంజులు అత్యంత పౌరుషంగా పోరాడుతాయి. కోడి పందాలంటే ప్రత్యేకంగా స్థలాలు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. రక్తమోడుతున్నా వీరోచితంగా పోరాడి ఒక కోడి గెలిస్తే.. మరో పుంజు ప్రాణాలు విడుస్తుంది. ఆ తరువాత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంది.
పక్కా ప్లాన్‌తోనే..
కోళ్ల పందేల నిర్వహణ పక్కా ప్లాన్‌తో చేపడుతున్నారు. పోలీసులు, జన సంచారం లేని స్థలాలు గుర్తిస్తారు. స్థానికుల సాయంతో ముందుగా పరిశీలన చేసి బెట్టింగ్ రాయుళ్లను ఒకచోటుకు తీసుకొస్తారు. ఎవరైనా వస్తే తప్పించుకునేందుకు పథక రచనలు కూడా ఉంటాయి. రెండు గ్రూపుల వ్యక్తులు తమకు నచ్చిన కోడిపై బెట్టింగ్ కడతారు. రూ.10 వేల నుంచి మొదలు రూ. లక్షల్లో పందేలు కాస్తారు. పెట్టిన బెట్టుకు రెండు, మూడింతలు లాభం వస్తుండటంతో కొందరు అప్పులు చేసి మరీ పందెం కాయడానికి వస్తున్నారు. గెలుపొందినవారు సంతోషంగా వెళ్తుంటే ఓడిన వారు మాత్రం బాధపడుతున్నారు. దసరా పండుగతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల శివారులో గుట్టు చప్పుడు కాకుండా జోరుగా కోడిపందేలు నిర్వహించారు. పందెం రాయుళ్లు పందెం కోళ్లను ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్నారు. ప్రతీ ఆది, గురువారాల్లో ప్రత్యేక స్థలాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా.. పందెం రాయుళ్లలో మాత్రం మార్పు రావడం లేదు.
ఇటీవలి ఘటనలు..


