ఆసిఫాబాద్‌అర్బన్: తక్షణ రుణాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ లోన్ యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. అత్యవసర ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు నకిలీ రుణ ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తూ, ప్రాసెసింగ్ ఫీజులు, సర్వీస్ చార్జీల పేరుతో ముందుగానే డబ్బులు వసూలు చేస్తున్నారని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ లోన్ ఆఫర్‌లు వచ్చినప్పుడు ప్రజలు మూడు ముఖ్యమైన సూత్రాలు పాటించాలని తెలిపారు. ముందుగా డబ్బులు చెల్లించాలని కోరితే ఆగండి, ఎలాంటి పత్రాలు లేకుండానే తక్షణ రుణం ఇస్తామనే ఆఫర్లను నమ్మే ముందు ఆలోచించండి, రుణం అందించే సంస్థ అధికారిక వెబ్‌సైట్, సంప్రదింపు వివరాలు, విశ్వసనీయతను పరిశీలించి ధృవీకరించుకోండని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, ఆర్‌ఎస్సై కిరణ్, ఎస్సై దివ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తిచేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని, కేసుల విచారణలో జాప్యం చేయరాదని, పోలీసు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పోలీసులు నిరంతరం గస్తీ కాస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 112కు తక్షణమే స్పందించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


