సాంకేతికత వినియోగంతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సాంకేతికత వినియోగంతో అధిక దిగుబడులు

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

● ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ● కలెక్టర్‌ కె.హరిత ● జిల్లా కేంద్రంలో కిసాన్‌ మేళా

ఆసిఫాబాద్‌: వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో గురువారం కిసాన్‌ మేళాను అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఉత్పత్తులు, సాగు పద్ధతుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో సంభవించే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు సాగు విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. నీటి లభ్యత, వర్షపాతం, నేల స్వభావం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటి పొదుపు పద్ధతులతో కొరత పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొవచ్చని తెలిపారు. జిల్లాలో పంటల సాగు విధానాలలో మార్పులు తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా వరి సాగు విస్తీర్ణం 25 శాతం వరకు తగ్గించగలిగామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించే పద్ధతులపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలు, రాయితీ ప్రయోజనాలను రైతులకు తెలియజేయడం కిసాన్‌ మేళా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై యాంత్రీకరణ సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఏవో వెంకట్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, రాజంపేట సర్పంచ్‌ బుర్స పోచయ్య, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement