సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని అభివృద్ధి పనుల ను అధికార పార్టీ నాయకులు తమకు నచ్చిన వారికి కట్టబెడుతున్నారు. పేరుకు ఆన్‌లైన్‌లో గ్లోబల్ టెండర్‌గా సాంకేతికంగా కనిపిస్తున్నప్పటికీ తమకు కావాల్సిన వారికి అప్పగించేందు కు పోటీదారులను టెండర్ నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. ఆసిఫాబాద్ పట్టణ అభివృద్ధి నాలాలు, షాపింగ్ కాంప్లెక్స్, ఇతర సివిల్ వ ర్క్స్‌కు రూ.10కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.8కోట్లకు ఇటీవల టెండర్ పూర్తయి కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. ఈ కాంట్రాక్టు పనులు పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడే దక్కించుకున్నారు. అయితే ఈ టెండర్ మరికొందరు పోటీ పడినప్పటికీ వారి ని తప్పించి మరీ పనులు దక్కేలా ఓ ప్రజాప్రతినిధి సహాయం చేసినట్లు తెలుస్తోంది.
పదవి రానందుకు పనుల కాంట్రాక్టు
ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కీలక పదవి ఆశించిన సదరు కాంట్రాక్టర్‌కు చివరి క్షణంలో చేయి జారిపోయింది. ఎన్నికల్లో కౌన్సిలర్ల సంఖ్యాబలం ఉన్నప్పటికీ మద్దతు తెలపడంతో కొద్దిపాటి తేడాతో పీఠం ఎక్కడంలో విఫలమయ్యారు. అప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు చేసుకున్నారు. దీంతో ఆ ఖర్చును అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో సరి చేసుకునేందుకు తాజాగా ఈ కాంట్రాక్టు పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాక స్థా నిక కౌన్సిలర్లకు సైతం అభివృద్ధి పనులు తలా ఇంతా అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితో మొత్తం రూ.8కోట్ల పనులు అధికార పార్టీ కౌన్సిలర్లకు ఇస్తే వాళ్లు మళ్లీ సబ్ కాంట్రాక్టు ఇస్తున్నారు. ఇలా పనులను పంచుకుంటున్నారు. మరోవైపు కాగజ్‌నగర్ పట్టణంలోనూ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(యూఐడీఎఫ్) పనుల కాంట్రాక్టులను సైతం స్థానిక ప్రజాప్రతినిధులు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో స్థానిక నాయకుల జోక్యంతో పనుల్లో నాణ్యత లోపం ఏర్పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


