కెరమెరి: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండలంలోని ధనోరా పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ కార్మికులు ధర్నాకు దిగారు. మిషన్ భగీరథ పథకంలో జిల్లావ్యాప్తంగా 600 మంది కార్మికులు పనిచేస్తున్నామని, కొన్ని నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులకు మద్దతు తెలిపారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పెండింగ్ వేతనాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, భగీరథ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బాలేష్, నాయకులు జంషద్, షాకీర్, ధనోరా ఉప సర్పంచ్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.


