బెల్లంపల్లి: దక్షిణ మధ్య రైల్వే కాజీపేట్–బల్లార్షా మధ్య నాలుగో లైన్ విస్తరణ కోసం రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రైల్వేశాఖ కాంపిటెంట్ అథారిటీ అధికారులను నియమిస్తూ రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. మంచిర్యాల జిల్లా పరిధిలోని తాండూర్, బెల్లంపల్లి మండలాలకు కాంపిటెంట్ అథారిటీగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌ను, మందమర్రి, మంచిర్యాల మండలాలకు మంచిర్యాల ఆర్డీవోను కాంపిటెంట్‌గా రైల్వేశాఖ నియమించింది. వీరి నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది. నాలుగో రైల్వేలైన్ విస్తరణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఈ నెల 9, 10 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వేజోన్, సికింద్రాబాద్ డివిజన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఆ సర్వే నివేదికను ఈ నెల 15లోపు సమర్పించాలని రైల్వేశాఖ ఆదేశించింది. దీంతో నాలుగో లైన్ చేపట్టడానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించి ఆ నివేదికను రైల్వేశాఖకు పంపించడంతో ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నాలుగో రైల్వేలైన్ మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గూడూరు వరకు మొత్తం 744.80కిలోమీటర్ల మేర నిర్మించాలని సూత్రప్రాయంగా రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ లైన్ నిర్మాణంతో రైళ్ల వేగం పెరగడంతోపాటు రవాణా సౌకర్యం ఎంతగానో మెరుగుపడే అవకాశాలు ఉండనున్నాయి.


