ఆసిఫాబాద్‌అర్బన్: సహకార సంఘాలు సమన్వయంతో పనిచేస్తేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల చైర్మన్ అలీబిన్ అహ్మద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయంలో శుక్రవారం ఏడీసీసీ సీఈవో చండీ విశ్వేశ్వర్, డీజీఎం భీమేందర్, వెంకటస్వామి, డీసీవో కరుణాకర్, మేనేజర్ సీహెచ్ వెంకట్ రవీందర్‌తో కలిసి పాలు, గొర్లు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు అవగాహన కల్పించారు. ఏడీసీసీ సీఈవో మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘాల ఆర్థిక లావా దేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారా జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. నూతనంగా కనక వర్ష, సహకార సురక్ష పేర్లతో రెండు రకాల డిపాజిట్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. 444 రోజులకు చేసే డిపాజిట్ పథకంలో సాధారణ పౌరులకు 7.60శాతం, సీనియర్ సిటిజన్లకు 8.10 శాతం వడ్డీ అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సహకార సంఘ సభ్యులు, ఎఫ్‌పీవో సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


