ఆసిఫాబాద్‌అర్బన్: వెదురుతో తయారు చేసిన వస్తువులు వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మేదరులు తయారు చేసే వెదురు వస్తువులు చాలా చౌకగా లభిస్తాయని, వాటిని కొనుగోలు చేసి వారి కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలన్నారు. వెదురు వస్తువులను ప్రోత్సహించి కాలుష్య నియంత్రణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. మేదర కులస్తులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ వెదురు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనంతరం మేదరులు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు. వెదురుతో తయారు చేసిన శ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞాపికను కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నదీమ్, సీపీవో గురువయ్య, జిల్లా మేదర సంఘం ప్రతినిధులు సులువ కనకయ్య, డీకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు
జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. ప్రపంచ చెవిటి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగులకు న్యాయపరమైన సేవలు, చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి అనూష, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో దివ్యాంగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష మాట్లాడుతూ దివ్యాంగులకు న్యాయ సేవలు, చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. కౌశల్ వికాస్, దివ్యాంగుల రోజార్ సేతులో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, డీఈవో సచ్చిదానంద చారి, డీపీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


