బెంబేలెత్తిస్తున్న అడవి పందులు, ఎలుగుబంట్లు మనుషులపై నిత్యం దాడులు పంట చేలకు వెళ్లడానికి జంకుతున్న రైతులు పరిహారం అందడంలో తీవ్ర జాప్యం
తిర్యాణి మండలం రొంపెల్లి పంచాయతీ నాయకపూడ గ్రామానికి చెందిన ఈ మేకల కాపరి పేరు దినశంకర్. ఈ నెల 3న గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు మేపుతుండగా మూడు ఎలుగుబంట్లు అతడిపై దాడి చేశాయి. బాధితుడి కేకలు విన్న స్థానికులు ఎలుబంట్లను తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదివాసీ సంఘాల నాయకులు సుమారు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు.
పెంచికల్‌పేట్ ఎ ల్కపల్లి గ్రామానికి చెందిన దూగుంట నారాయణ గతేడాది పంట చేనులో పనులు చేస్తున్న సమయంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా, సుమారు రూ.30వేల వరకు ఖర్చయ్యింది. ఆస్పత్రి బిల్లుతో పరిహారం కోసం అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ చిల్లిగవ్వ అందలేదు.
పెంచికల్‌పేట్: అడవులకు నెలవైన కుమురంభీం ఆ సిఫాబాద్ జిల్లాలో అడవి పందులు, ఎలుగుబంట్లు బెంబేలెతిస్తున్నాయి. ఓ వైపు పంటలను నాశనం చేస్తుండగా, మరో వైపు మనుషులపైనా దాడులకు తెగపడుతున్నాయి. రైతులు పంట చేల రక్షణకు ప్రా ణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. వన్యప్రాణుల దాడుల్లో గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇటీవల తిర్యాణి మండలం నాయక్‌పూడ్ గ్రామాని కి చెందిన శంకర్‌పై మూడు ఎలుగుబంట్లు దాడి చే యడం కలకలం రేపింది. అటవీ జంతువుల దాడుల్లో గాయపడుతున్న వారికి అటవీశాఖ ఆధ్వర్యంలో పరిహారం అందిస్తున్నామని అధికారులు చెబు తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఆస్పత్రుల రూ.వేలు ఖర్చు చేస్తున్నా పరిహారం అందడం లేదని బాధితులు వాపోతున్నారు.
గాయపడుతున్న రైతులు
జిల్లాలో పెద్దఎత్తున అడవులు విస్తరించి ఉన్నాయి. పెంచికల్‌పేట్, బెజ్జూర్, దహెగాం, కౌటాల, చింతలమానెపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), వాంకిడి, తిర్యాణి మండలాల్లో నిత్యం అడవి పందులు, ఎలుగుబంట్లు రైతులపై దాడులు చేస్తున్నాయి. వరుస దాడులతో రైతులు, కూలీలు పందుల దాడులతో చేలకు వెళ్లేందుకే జంకుతున్నారు. క్షతగాత్రులకు గాయాల తీవ్రత ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు అడవి జంతువుల దాడులు 14 నమోదు కాగా, బాధితులకు అటవీశాఖ తరుఫున రూ.4.40లక్షల పరిహారం అందించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది జరిగిన ఘటనలు
వివరాలు అందించాం
అడవి పందుల దాడుల్లో గాయపడిన వారి వివరాలను పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నగదు విడుదల కాగానే బాధితులకు అందిస్తాం. రైతులు, కూలీలు అటవీ ప్రాంతాలు, పంట చేలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం.
– అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్


