● ప్రతీనెల మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ ● ఆటపాటలు, సృజనాత్మకతకు పెద్దపీట ● పక్కాగా అమలుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ | - | Sakshi
Sakshi News home page

● ప్రతీనెల మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ ● ఆటపాటలు, సృజనాత్మకతకు పెద్దపీట ● పక్కాగా అమలుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

● ప్రతీనెల మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ ● ఆటపాటలు, సృజనాత్మకతకు పెద్దపీట ● పక్కాగా అమలుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ

కెరమెరి: ప్రతీరోజు పుస్తకాలు, నోటు బుక్కులతో నిండిన బ్యాగును భుజాని వేసుకుని బడిబాట పట్టే విద్యార్థులకు ఇక నెలలో ఒకరోజు బ్యాగు భారం ఉండదు. పాఠ్య పుస్తకాలకు పరిమితమైన విద్యకు భిన్నంగా ఆటలు, పాటలు, కళలు, ప్రయోగాలు, సృజనాత్మకత, తదితర కార్యక్రమాలతో ఆహ్లాదకర అభ్యసన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ‘నో బ్యాగ్‌ డే’కు శ్రీకారం చుట్టింది. గతంలో ప్రతీ శనివారం ‘నో బ్యాగ్‌ డే’ పాటించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఇక నుంచి ప్రతీనెల మూడో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్‌ డేను కచ్ఛితంగా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

కళలకు పెద్దపీట..

చిత్రలేఖనం, కథలు, పాటలు, నృత్యం, హస్తకళలు, వ్యాసరచన, వృక్తృత్వం, క్విజ్‌ వంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇది మంచి వేదికగా మారనుంది. తరగతి గదిలో పె ద్దగా మాట్లాడని విద్యార్థులు సైతం తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందనున్నారు. విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు చిన్నచిన్న ప్రయోగాలు, నమూనాల తయారీ, పరిశీలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుస్తకంలో చదివిన అంశాలను ఆచరణలో చూపించడం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, పరిశీలన శక్తి, తార్కిక ఆలోచన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉపాధ్యాయులకు సవాల్‌..

విద్యార్థులు కేవలం ఆటలు, వినోదాలకే పరిమితం కాకుండా ప్రతీ కార్యక్రమం ద్వారా ఏదో ఒక విషయాన్ని నేర్చుకునేలా ఉపాధ్యాయులు కార్యాచరణ రూపొందించాలి. తరగతుల వారీగా విద్యార్థుల వయస్సు, ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయాలి. ప్రతీ విద్యార్థి ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి.

బడి అంటే చదువొక్కటే కాదు..

విద్యార్థి సమగ్ర అభివృద్ధికి పాఠ్య పుస్తక జ్ఞానంతో పాటు సృజనాత్మకత, సామాజిక అవగాహన, క్రీడానైపుణ్యం, కళా ప్రతిభ కూడా అవసరం. ఈ నేపథ్యంలో ‘నో బ్యాగ్‌ డే’ ద్వారా విద్యార్థులకు విభిన్న అనుభవం అందించేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. నెలలో ఒక్కరోజైనా పుస్తకాల ప్రపంచం నుంచి బయటికి వచ్చి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తూ నేర్చుకునే అవకాశం విద్యార్థులకు లభించనుంది. కార్యక్రమం విజయవంతానికి తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం. ఆరోజు పుస్తకాలు, నోట్‌ బుక్కులతో కూడిన బ్యాగ్‌ను పంపకుండా పాఠశాల సూచించిన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది.

పక్కాగా అమలు చేయాలి

ఇక నుంచీ ప్రతీనెల మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ను ప్రతీ పాఠశాలలో పక్కాగా అమలు చేయాలి. కేటాయించిన తేదీల్లో పుస్తకాలతో రావద్దని విద్యార్థులకు చెప్పాలి. ఆటలు, పాటలు, సృజనాత్మకతకు పెద్దపీట వేయాలి. పాఠశాలల్లో పుస్తకేతర కార్యక్రమాలు అమలు చేయాలి. విద్యార్థులు ఒక్కరోజు స్వేచ్ఛగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.

– సచ్చిదానందచారి, జిల్లా విద్యాధికారి

బరువుకు బ్రేక్‌

విద్యార్థులకు చదువుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు విద్యను మరింత ఆసక్తికరంగా మార్చడమే ‘నో బ్యాగ్‌ డే’ ముఖ్య ఉద్దేశం. సాధారణ రోజుల్లో పాఠ్యాంశాల బోధనకు ప్రాధాన్యం ఇస్తే మూడో శనివారం మాత్రం ఆచరణాత్మక అభ్యసనకు పెద్దపీట వేయనున్నారు. విద్యార్థులు స్వయంగా పాల్గొని అనుభవం ద్వారా నేర్చుకునేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల ద్వారా క్రమశిక్షణ, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమన్వయం వంటి అంశాలను నేర్పించనున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలిగేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement